
ED Raids on Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై ఈడీ దాడులు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అధికారులు ఏకకాలంలో 35 ప్రాంతాల్లో..50 కంపెనీలతో పాటు 25 మందిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంతా యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల్లో దాదాపు రూ.3వేల కోట్లను దారి మళ్లించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తెలుస్తోంది. సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ సంస్థలపై ముందుకు సాగుతోంది.
2017 నుంచి 2019 మధ్య కాలంలో అనిల్ అంబానీకి చెందిన సంస్థలకు యెస్ బ్యాంక్ దాదాపు రూ.3వేల కోట్ల వరకు విలువైన రుణాలను అందించింది. అనిల్ అంబానీ బ్యాంక్ వ్యవస్థాపకులకు లంచాలు ఇవ్వటంతో రుణ మంజూరు నిబంధనలను పక్కన పెట్టి లోన్స్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
ఇక రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ కార్పొరేట్ రుణాలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3వేల 742 కోట్లుగా ఉండగా.. అవి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెండితలకు పైగా పెరిగి రూ.8వేల 670 కోట్లకు చేరుకోవటంపై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. ఇవాళ జరుగుతున్న దర్యాప్తు ప్రధానంగా యెస్ బ్యాంక్ అధికారులు, అంబానీ సంస్థలకు ఉన్న లింకులపైనే కొనసాగుతోంది. అనిల్ సంస్థలకు లోన్స్ ఇచ్చే విషయంలో బ్యాంక్ ఎలాంటి తప్పులు చేసిందనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.
దర్యాప్తులో ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కంపెనీకి బ్యాంక్స్ రుణాలు ఎలా ఇచ్చాయి. సరైన డాక్యుమెంట్లు లేకుండా ఒకే అడ్రస్ కింద ఉన్న డైరెక్టర్లు, రుణ గ్రహీతలుపై ఈడీ ఫోకస్ చేసింది. అలాగే కొన్ని అంబానీ సంస్థలకు అప్రూవల్ మునుపే డబ్బు ఖాతాల్లో జమ చేయటం.. మరికొన్ని సార్లు లోన్ కోసం అప్లై చేసిన రోజునే హడావిడిగా రుణాల మంజూరు వంటి తప్పిదాలను దర్యాప్తు గుర్తించింది. ఇవి పూర్తిగా బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని.. ఈ డబ్బును అనిల్ షెల్ కంపెనీలకు మళ్లించి రుణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. లోన్స్ మంజూరుకు ముందు బ్యాంక్ ప్రమోటర్ల సంస్థలకు లంచాలు వెళ్లినట్లు తేల్చింది ఈడీ.