- 20 మందిని ఎంపిక చేసిన మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు
- నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి
మల్కాజిగిరి, వెలుగు : తెలంగాణ పోలీస్ శాఖలో ట్రాన్స్‌జెండర్లకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీలక ముందడుగు వేసింది. రానున్న పోలీస్ నియామకాల్లో కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లుగా ట్రాన్స్‌జెండర్లు ఎంపికయ్యేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో శిక్షణకు ఎంపికైన 20 మంది ట్రాన్స్‌జెండర్లకు సీపీ సుమతి స్టడీ మెటీరియల్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికీ సాధికారత - ఎవరినీ విస్మరించవద్దు’ అనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన 20 మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు 4 నెలల పాటు శిక్షణతో పాటు వసతి కల్పిస్తామన్నారు. దీని కోసం రూ.3.50 లక్షలను మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ ట్రైనింగ్‌ను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పర్యవేక్షిస్తుందన్నారు. తెలంగాణ దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ సమన్వయకర్త ప్రీతి సునంద, మహిళా భద్రతా విభాగం డీసీపీ ఉషారాణి పాల్గొన్నారు.
