మల్కపేట ట్రయల్ ​రన్ ​సక్సెస్.. నెల రోజుల్లో కాళేశ్వరం లింక్-3 పూర్తి

మల్కపేట ట్రయల్ ​రన్ ​సక్సెస్.. నెల రోజుల్లో కాళేశ్వరం లింక్-3 పూర్తి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్​–3లోని మల్కపేట పంపుహౌస్ ట్రయల్​రన్ ​సక్సె స్ అయింది. దీన్ని మిడ్​మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించేందుకు చేపట్టగా.. అప్పర్ ​మానేరుకు దిగువన ఉన్న రెండో పంపుహౌస్ ​ట్రయల్ (సింగసముద్రం) రన్ ​కూడా సక్సెస్​అయితే ఈ ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. మల్కపేట రిజర్వాయర్​కు దిగువన ఉన్న పంపుహౌస్​లోని రెండు మోటార్లలో ఒక మోటారును మంగళవారం ఉదయం 7 గంటలకు ట్రయల్​రన్ ​చేసి నీటిని రిజర్వాయర్​కు తరలించారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్ట్​ ఇరిగేషన్ ​అడ్వైజర్ ​పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీర్లు ట్రయల్​రన్ సక్సెస్​ఫుల్​గా పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 86,150 ఎకరాల ఆయకట్టు కోసం లింక్–3 (ప్యాకేజీ–9) పనులను చేపట్టారు. రూ.911.32 కోట్లతో ఈ పనులకు అడ్మినిస్ట్రేటివ్ ​శాంక్షన్ ఇవ్వగా 2020లో ఇంకో రూ.84.69 కోట్లు పెంచేందుకు అనుమతులు ఇచ్చారు. మూడు టీఎంసీల కెపాసిటీ గల మల్కపేట రిజర్వాయర్​ను ఇంకో రూ.566.11 కోట్లతో నిర్మించారు. మొత్తంగా లింక్​– 3 పనులు దాదాపు రూ.1,60‌‌‌‌‌‌‌‌0 కోట్లతో చేపట్టారు. మిడ్​మానేరు నుంచి 2.6 కిలోమీటర్ల అప్రోచ్​ చానల్​ ద్వారా 12.03 కిలోమీటర్ల పొడవైన టన్నెల్​లో నీళ్లు చేరుతాయి. ఈ టన్నెల్ తవ్వకం పనులు సుదీర్ఘంగా సాగడంతోనే ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించిన నాలుగేండ్ల తర్వాత లింక్​–3 అందుబాటులోకి వస్తోంది.

నెల రోజుల్లో అందుబాటులోకి..

మల్కపేట రిజర్వాయర్​ నుంచి 18.25 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కెనాల్​ ద్వారా నీళ్లు సింగసముద్రం చెరువుకు చేరుతాయి. అక్కడి పంపుహౌస్​లో రెండు పంపులు ఏర్పాటు చేశారు. ఆ పంపుహౌస్​ నుంచి 6.59 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా అప్పర్  మానేరుకు నీళ్లు చేరుతాయి. మంగళవారం మల్కపేట రిజర్వాయర్​లో 2.25 మెగావాట్ల కెపాసిటీ ఉన్న రెండు మోటార్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మోటారును ట్రయల్​రన్ చేయగా.. రెండో మోటారును వారం, పది రోజుల్లో ట్రయల్​రన్ చేసే ప్రయత్నాల్లో ఇంజనీర్లు ఉన్నారు. సింగసముద్రం పంపుహౌస్​లో 2.23 మెగావాట్ల కెపాసిటీ గల రెండు మోటార్లు ఏర్పాటు చేశారు. ఆ రెండు పంపుల్లో ఒక పంపును రానున్న 20 రోజుల్లో ట్రయల్​రన్​ చేస్తామని, రెండో పంపును నెల రోజుల్లో అందుబాటులోకి తెస్తామని ఇంజనీర్లు తెలిపారు. జూన్​ నెలాఖరుకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం లింక్​–3 అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనిద్వారా ప్రతిపాదిత ఆయకట్టుకు నీళ్లివ్వడానికి 150 చెరువులను నింపుతామని, కాల్వలపై ఇందుకు అవసరమైన తూములు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.