గజ్వేల్​ ఆర్డీఓ ఆఫీసు ఎదుట నిర్వాసితుల నిరసన

గజ్వేల్​ ఆర్డీఓ ఆఫీసు ఎదుట నిర్వాసితుల నిరసన
  • న్యాయం చేయాలని కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ​నిర్వాసితుల ఆందోళన

గజ్వేల్, వెలుగు: కొండపోచమ్మ, మల్లన్న సాగర్​ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని సోమవారం గజ్వేల్​ ఆర్డీఓ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. రిజర్వాయర్లలో పొలాలను, ఇండ్లను కోల్పోగా ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారంతో కొన్న ప్లాట్లు కూడా రైల్వే లైన్​లో పోయాయి. ఈ పరిహారమూ రాకపోవడంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్​ఆర్డీఓ ఆఫీసు ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో గ్రామ శివార్లలో భూములు కొనుక్కున్నామన్నారు. 2020లో మనోహరాబాద్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న రైల్వే ట్రాక్ ప్లాన్ మారడంతో తమ ప్లాట్లలో నుంచి వెళ్లిందని, కలెక్టర్​ను కలవగా ప్లాటుకు రూ. 2 లక్షలు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. రైల్వే పనులు జరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదన్నారు.  న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారులెవరూ స్పందించకపోవడంతో నిరసన విరమించి వెళ్లిపోయారు.