
మల్లన్నసాగర్ కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మల్లన్నసాగర్ రైతుల పరిహారానికి సంబంధించిన కేసులో జైలుశిక్ష పడిన ముగ్గురు అధికారులకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట కల్పించింది. కోర్టు ధిక్కార కేసులో సింగిల్ జడ్జి విధించిన జైలుశిక్ష అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల పరిహారం విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ గతంలో సిద్దిపేట జిల్లా వేములఘాట్ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసులో తాను ఆదేశాలను అమలు చేయకపోవడంతో సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, తొగుట తహసీల్దార్ వీర్ సింగ్, గజ్వేల్ ఇంజనీరింగ్ సూపరింటెండెంట్ వేణులకు సింగిల్ జడ్జి మూడు నెలల జైలుశిక్ష విధించారు. దీనిపై వారు అప్పీలు చేసుకోగా.. చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.