రోడ్లు తవ్వేసి.. అర్ధరాత్రి మల్లన్న సాగర్ పనులు

రోడ్లు తవ్వేసి.. అర్ధరాత్రి మల్లన్న సాగర్ పనులు
  • భూనిర్వాసితుల ఆగ్రహం.. భారీగా పోలీసుల మోహరింపు
  • ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
  • పూర్తి పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని డిమాండ్
  • మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌లో భారీగా పోలీసుల మోహరింపు

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డ కిష్టాపూర్​లో భూనిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు పనులు నిర్వహించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. నాలుగు రోజుల క్రితం కట్టకు అడ్డంగా ఉన్న మూడు ఇండ్లను కూల్చివేసేందుకు ఆఫీసర్లు రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు పూర్తి పరిహారం ఇస్తామని ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో నిర్వాసితులు శాంతించారు. కానీ ఆఫీసర్లు గురువారం అర్ధరాత్రి పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఏటిగడ్డ కిష్టాపూర్ నుంచి సిద్దిపేట వైపు వెళ్లే రోడ్డును జేసీబీలతో తవ్వేసి కట్ట నిర్మాణ పనులు స్టార్ట్​ చేశారు. దీంతో గ్రామస్తులు మరోసారి ఆందోళనకు దిగారు. రోడ్డును తొలగించడం వల్ల తాము సిద్దిపేట కు వెళ్లే చాన్స్​లేకుండా చేస్తున్నారని, పొమ్మనలేక పొగపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామాల్లో వందలాది పోలీసులు  

నిర్వాసితులకు అండగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ‘చలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్​ అయిన పోలీసులు మిరిదొడ్డి, దుబ్బాక మండలాలకు చెందిన పలువురు నేతలను శుక్రవారం ఉదయం నుంచే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.  ముంపు గ్రామాల్లో వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. వివిధ పనులపై బయటకు వెళ్లేవారిని ఆధార్​ కార్డులు ఉంటేనే అనుమతించారు. రఘునందన్‌‌రావును వెంకట్రావు పేట వద్దే అడ్డుకొని బలవంతంగా చేర్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దౌల్తాబాద్ స్టేషన్​కు తరలించారు.

లీగల్ గా ఉంటే ఎందుకు పోనిస్తలే?: రఘునందన్ రావు

మల్లన్నసాగర్​పనులన్నీ లీగల్​గా ఉన్నప్పుడు అక్కడికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రశ్నించారు. కట్ట పనులను పరిశీలించేందుకు వెళ్తే తనకు బందోబస్త్ కల్పించాల్సిన పోలీసులు.. అరెస్ట్ చేయడం ఏమిటంటూ మండిపడ్డారు. దీని వెనక ఏదో కుట్రకోణం ఉందన్నారు. చేర్యాల పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం ఇవ్వకుండానే ఊరికి వెళ్లే దారిని మూసేసి కట్ట పనులు చేస్తున్నారని, వాటిని ఆపాలని తాను కోరినా రెవెన్యూ అధికారులు రాత్రిపూట పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలతో చర్చించి, నిర్ణయం తీసుకుందామన్నా వినలేదన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఓపెన్ గా ఉండాల్సిన విషయాలను సీక్రెట్ గా ఉంచడంపై అనుమానాలు కలుగుతున్నాయని రఘునందన్ రావు అన్నారు. తనను సైతం ఇంత పక్కాగా అరెస్ట్ చేయడం వెనక ఏదో కుట్ర ఉందని ఆరోపించారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చాకే పనులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు.