మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన మేడిపల్లి గౌడ సంఘం నేతలు

మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన మేడిపల్లి గౌడ సంఘం నేతలు

మేడిపల్లి, వెలుగు: జీవో 58 ప్రకారం రెగ్యులరైజేషన్ చేసిన భూముల పట్టాల పంపిణీకి వచ్చిన మంత్రి మల్లారెడ్డికి నిరసన తెగ తగిలింది. మంగళవారం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడకు వచ్చిన మంత్రిని మేడిపల్లి గౌడ సంఘం నేతలు అడ్డుకున్నారు. తమకు కేటాయించిన భూమిలో ప్రభుత్వం ఏ విధంగా పట్టాలు పంపిణీ చేస్తుందని నిలదీశారు. దీంతో వారికి మంత్రి నచ్చజెప్పి.. అందరికీ న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని, వారందరూ దరఖాస్తు చేసుకొని పట్టాలు పొందాలని సూచించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రభుత్వ భూముల్లో తెలిసీ తెలియక ఇండ్లు నిర్మించుకున్న పేదలకు జీవో నంబరు 58 ద్వారా క్రమబద్ధీకరించి పట్టాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో రవి, మేడిపల్లి తహసీల్దార్​మహిపాల్ రెడ్డి, పీర్జాదీగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పీర్జాదీగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ నగర అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

బీజేపీ నేతల ఆందోళన.. అరెస్టు

పట్టాల పంపిణీకి అబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయలేదని, అర్హులకు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలకే పట్టాలు ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం అందించేందుకు సభ జరుగుతున్న బండి గార్డెన్ వద్దకు వారు రావడంతో పోలీసులు అడ్డుకొని, అరెస్టు చేసి మేడిపల్లి పీఎస్ కు తరలించారు.  కాగా, అధికారిక కార్యక్రమంలో అధికారులు కేవలం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఫొటోలను మాత్రమే బ్యానర్ లో వేసి, స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఫొటోలు పెట్టకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.