- మంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం
- 2,500 గజాల భూమి కబ్జా చేసి 10 గుంటల జాగాలో కాలేజీకి రోడ్డు
- ఇవాళ స్వాధీనం చేసుకున్న హెచ్ఎండీఏ
- ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ ఇచ్చిన దరఖాస్తుపై ఆధారంగా కలెక్టర్ చర్యలు
మేడ్చల్: మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో, హెచ్ఎండిఏ లేఅవుట్లో మంత్రి మల్లారెడ్డి ఆక్రమించి కళాశాల కోసం నిర్మాణం చేసిన రోడ్డును నేడు అధికారులు తొలగించారు. అప్పుడు మొత్తం 2500 గజాల భూమిని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించారు. అందులో 1210 గజాల్లో(10 గుంటలు) రోడ్డు నిర్మాణం చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి ఆక్రమించుకున్న భూమి వ్యవహారం మరొకమారు తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు హెచ్ఎండిఎ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు.
గతంలోనూ అనేక ఆరోపణలు
గత ఏడాది డిసెంబర్ 13న శామీర్ పేట మండలం కేశవాపూర్ గ్రామంలో గిరిజనుల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా బదిలీ చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లారెడ్డిపై ఐపీసీ 420 కింద కేసులు నమోదు చేశారు. తనకు ఆ భూ వివాదానికి సంబంధం లేదని ఎఫ్ఐఆర్ పై మల్లారెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
10 గుంటలు ఆధీనంలోకి తీసుకున్నం
గుండ్లపోచంపల్లి కమిషనర్ రాములు
కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండీఏ లేఅవుట్ నెం 61/ఎస్ గ్రేటర్ ఎన్ 11, 2004 లోని పది గుంటల స్థలాన్ని మల్లారెడ్డి సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్నామని గుండ్ల పోచంపల్లి కమిషనర్ రాములు చెప్పారు. గతంలో కౌన్సిల్ తీర్మానం ద్వారా ఈ స్థలాన్ని మల్లారెడ్డి సంస్థలు స్వాధీనం చేసుకొని రోడ్డు వేసుకున్నాయని ప్రస్తుతం ఆ రోడ్డును పొక్లెయినర్ తో తొలగించామన్నారు. తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు.
