మా దగ్గర దొరికింది రూ.28 లక్షలే: మంత్రి మల్లారెడ్డి

మా దగ్గర దొరికింది రూ.28 లక్షలే:  మంత్రి మల్లారెడ్డి

తమ దగ్గర దొరికింది కేవలం రూ.28 లక్షలేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇన్ కమ్ ఉంటేనే కదా..? ట్యాక్స్ కట్టేదని వ్యాఖ్యానించారు. తమ మీద జరిగిన రైడ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్ర అని అన్నారు. రైడ్స్ తనకు కొత్త కాదని..తనకు  రూల్స్ అన్నీ తెలుసని అన్నారు. కేంద్ర బలగాలతో  దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తనపై రైడ్స్ కోసం ఐటీ అధికారులు 200 వాహనాలను బుక్ చేసుకున్నారని చెప్పారు. తనను బద్నాం చేయడానికే ఐటీశాఖ సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత దౌర్జన్యం తాను ఇంత వరకు చూడలేదన్నారు. తాము సేవ చేస్తున్నాం కానీ.. బిజినెస్ కాదన్నారు.

ఐటీ అధికారులు తమను నమ్మించి మోసం చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తమ కొడుకును మెంటల్ టార్చర్ పెట్టారని అన్నారు. రూ.100 కోట్లు దొరికినట్లు ఐసీయూలో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సైన్ చేయించుకున్నారని ఆరోపించారు. కొడుకు హాస్పిటల్ లో ఉంటే తనను చూడనివ్వరా..? అని ప్రశ్నించారు. ల్యాప్ టాప్ ను ఐటీ అధికారులు మర్చిపోతే వారికే తామే ఇచ్చామన్నారు. తాము ఎలాంటి ల్యాప్ టాప్  తీసుకెళ్లలేదన్నారు.

తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులంతా పేద విద్యార్థులేనని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఫీజులన్నీ ఆన్ లైన్ లోనే కడుతున్నారని..ఇంకా దాచుకునేదేం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పారని..ఆ ధైర్యంతోనే ఇప్పుడు మాట్లాడుతున్నానని అన్నారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదన్నారు. కేవలం టీఆర్ఎస్ మంత్రిననే తనపై ఐటీశాఖ అధికారులతో తనిఖీలు చేస్తున్నారని అన్నారు. ఎంత దోచుకున్నామో చెబితే తామే ఒప్పుకుంటామని.. ట్యాక్స్ కడుతామని చెప్పారు. తాను చాలా సింపుల్ గా ఉంటానని..ఖరీదైన బట్టలు కూడా వేసుకోనన్నారు. ఉంగరాలుకూడా పెట్టుకోనన్నారు.