మల్లారెడ్డి వివాదాస్పద భూమిలో సర్వే

మల్లారెడ్డి వివాదాస్పద భూమిలో సర్వే
  • పోలీసు బందోబస్తు మధ్య పరిశీలన
  • మల్లారెడ్డి భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : అడ్లూరి లక్ష్మణ్

జీడిమెట్ల, వెలుగు : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ పరిధిలోని సుచిత్రలో సర్వే నంబర్ 82లో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ సర్వే జరిగింది. శనివారం మాజీ మంత్రి మల్లారెడ్డి, మరో వర్గానికి మధ్య జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని ఆదివారం పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సర్వే చేస్తున్నంత సేపు వివాదాస్పద భూమి వైపు ఎవరినీ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నరు.

బారికేడ్లు ఏర్పాటు చేసి వెహికల్స్ దారి మళ్లించారు. అటు మల్లారెడ్డి, ఇటు బాధితుల వద్ద ఉన్న డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎస్వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసు బందోబస్తు మధ్య సర్వే కంప్లీట్ అయింది. త్వరలో భూమికి సంబంధించిన పూర్తి వివరాలను రెవెన్యూ అధికారులు వెల్లడించే అవకాశాలున్నాయి.

ఫెన్సింగ్ వేస్తుంటే అడ్డుకున్నడు : అడ్లూరి

మల్లారెడ్డి భూముల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 82లో నెలకొన్న భూ వివాదంపై ఆదివారం ఆయన కొంపల్లిలో మీడియాతో మాట్లాడారు. 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌15లో సుధామ నుంచి తనతో పాటు ఎనిమిది మంది కలిసి 3,393 గజాల భూమి కొనుగోలు చేసినట్టు తెలిపారు. కొన్నవారిలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు కూడా ఉన్నారని చెప్పారు. అప్పటి నుంచి మల్లారెడ్డి సర్వేకు సహకరించలేదన్నారు.

‘‘2016లో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఫెన్సింగ్ వేస్తుంటే మల్లారెడ్డి తన అధికార బలంతో మమ్మల్ని పోలీస్ స్టేషన్​కు తరలించాడు. అప్పట్లో మేము పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలే. మేమంతా 2021లో సేరి శ్రీనివాస్​రెడ్డికి భూమి అమ్మేసినం. దీంతో ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పొజిషన్​లోకి వెళ్తే మల్లారెడ్డి దాడులు చేయించాడు. స్థలం మల్లారెడ్డిదే అయితే.. ఇప్పటి దాకా ఎందుకు వెకేట్ చేయించలేదు? మా ప్లేస్ కబ్జా చేసి సినీ ప్లానెట్, వైన్​షాప్​లు పెట్టడానికి ప్రయత్నిస్తే అప్పట్లో అడ్డుకున్నం.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని బద్నాం చేసిండు. ఈ భూ వివాదంలో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? గతంలో ఈ వివాదాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించుకోవాలన్నరు. మల్లారెడ్డి చెప్పినా పట్టించుకోలేదు’’అని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.