బీజేపీకి‘400 సీట్లు’ నాన్సెన్స్.. మల్లికార్జున ఖర్గే

బీజేపీకి‘400 సీట్లు’ నాన్సెన్స్.. మల్లికార్జున ఖర్గే
  • కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఉనికే లేదు

చండీగఢ్: ఈసారి లోక్​సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని బీజేపీ చెప్పడం పెద్ద నాన్​సెన్స్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు. ఆ పార్టీకి 200 సీట్లు కూడా రావని అన్నారు. మంగళవారం ఆయన అమృత్‌‌‌‌సర్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సీట్లు చాలా తగ్గుతున్నాయని, కాంగ్రెస్, ఇండియా కూటమి సీట్లు పెరుగుతాయని అన్నారు. ‘‘మీ సీట్లు తగ్గుతున్నప్పుడు,  మావి పెరుగుతున్నప్పుడు. 400 సీట్లు అనే నినాదం పెద్ద నాన్​సెన్స్(అర్థంలేని వాదన)​.

బీజేపీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. వారికి 200 సీట్లకు మించి రావు” అని చెప్పారు. ‘‘తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఉనికిలోనే లేదు, కర్నాటకలో బలహీనపడింది. మహారాష్ట్రలోనూ బలంగా లేదు. బెంగాల్, ఒడిశాలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఇక 400 సీట్లు ఎట్లొస్తయి” అని ప్రశ్నించారు.

జూన్​4 తర్వాత షా ఉద్యోగం ఊడుతుంది

ప్రధాని మోదీ ఎక్కువ మాట్లాడతారని.. తక్కువ పని చేస్తారని ఖర్గే విమర్శించారు. బీజేపీ చెప్పే వంద మాటలు, ప్రకటనలు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క పనితో సమానమని అన్నారు. చాలా చిన్న విషయాలను కూడా మోదీ విపరీతంగా, గొప్పగా ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో రూ.72 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చామని.. ఆయన పని మాత్రమే చేశారు తప్ప ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని అన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఖర్గే ఉద్యోగం పోతుందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘నేను ఉద్యోగం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు. నేను చిన్నతనం నుంచే ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. జూన్ 4 తర్వాత అమిత్​ షా తన ఉద్యోగం గురించి ఆలోచించాలి” అని ఖర్గే అన్నారు.పంజాబ్ భవిష్యత్తుకు డ్రగ్స్ అతిపెద్ద సవాల్​గా మారాయని ఖర్గే అన్నారు. రాష్ట్రంలో యువత నిర్వీర్యం అవుతున్నదని.. నిరాశకు లోనవుతుందని చెప్పారు. డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.