బీజేపీ, బీఆర్ఎస్ ​తోడు దొంగలు : మల్లికార్జున్​ఖర్గే

బీజేపీ, బీఆర్ఎస్ ​తోడు దొంగలు : మల్లికార్జున్​ఖర్గే
  • లిక్కర్​స్కామ్​లో అందుకే కవితను అరెస్ట్​ చేయలేదు
  •     కాంగ్రెస్ ​నేతల ఇండ్లపైకి ఐటీ, ఈడీని ఉసిగొల్పుతున్నరు: ఖర్గే

పద్మారావునగర్, వెలుగు: రాష్ర్టంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్​నేతలు కలిసి కుట్రలు చేస్తున్నారని, ‘నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్త’ అన్నట్లు తోడుదొంగల్లా తయారయ్యారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్​ఖర్గే అన్నారు. శనివారం సనత్ నగర్​ నియోజకవర్గం బన్సీలాల్​పేట డివిజన్ ​సీసీనగర్​లో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్​ కేసులో ఆప్​నేతలను అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. తెలంగాణకు చెందిన వారిని ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ర్టాల్లో కాంగ్రెస్ నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతో దాడులకు ఉసిగొల్పుతున్న కేంద్రం.. మిగితా పార్టీల నేతల జోలికి పోవడం లేదన్నారు. అదానీ లాంటి బడా వ్యాపారులకే మేలు చేస్తూ, పేదవారిని, నిరుద్యోగులను మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్ కు వచ్చిన ప్రతీసారి కేసీఆర్​ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శించే మోదీ, అమిత్ షా లు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న సంగతిని ప్రజలు గమనించాలని, దీన్ని బట్టే వారి అపవిత్ర బంధం తెలుస్తోందని ఖర్గే అన్నారు. 

ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ప్రేమ బంధం పెనవేసుకొని ఉందని, వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఇండియాకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ .15 లక్షలు వేస్తానన్న మోదీ ఆ పని ఇంతవరకు ఆ పని ఎందుకు చేయడం లేదన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్​ఎన్నికల హామీలను బీఆర్ఎస్​ కాపీ కొట్టిందన్నారు. స్యాండ్, ల్యాండ్, లిక్కర్​అవినీతికి పాల్పడుతూ.. బీఆర్ఎస్​ నేతలు కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. 

పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్​ రావాలన్నారు. ఫామ్​హౌస్​ సీఎం కేసీఆర్ ను ఇంటికి సాగనంపే టైమ్ వచ్చిందని, అందివచ్చిన ఈ మంచి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు మాణిక్​రావు ఠాక్రే, బోస్​రాజు, సందీప్, ప్రణవ్, అనిల్ యాదవ్, రాజ్ కుమార్, వెంకటేశ్​యాదవ్, తెలంగాణ విఠల్, రూబీ మనోహర్​పాల్గొన్నారు.


ఎమ్మెల్యేలను కలవరు.. 

పేదలకు టైమ్​ ఇవ్వరు: ఖర్గే

ఆమనగల్లు, వెలుగు: ఎమ్మెల్యేలను కూడా కలవని ఫామ్​హౌస్ సీఎంకు పేద ప్రజలను కలిసే టైమ్ లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో ఎన్నికల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మోదీ, కేసీఆర్ ఎన్ని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను బడా బాబులకు కట్టబెడుతున్న పీఎం మోదీ, మైన్, వైన్, ల్యాండ్, స్యాండ్  దోచుకుంటున్న కేసీఆర్, ఒవైసీ ముగ్గురూ ఒక్కటేనన్నారు. 

రైతు బంధు పంపిణీలో మోదీ, కేసీఆర్ ​కుట్ర: రేవంత్​రెడ్డి

ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే మోదీ, కేసిఆర్​లు కుట్ర పన్ని ఈసీ నుంచి అనుమతి పొంది రైతుబంధు పంపిణీ చేస్తున్నారని దళిత, బీసీ, మైనార్టీల బంధు ఎందుకు ఇవ్వడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్​పార్టీ రైతుబంధుకు వ్యతిరేకం కాదని, దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్,​ బీసీని సీఎంను చేస్తానన్న మోదీ ఈ పథకాలపై ఎందుకు స్పందించడం లేదని, మైనార్టీ బంధుపై ఒవైసీ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. 

బక్కోడిని చెప్పుకుంటున్న కేసీఆర్ కు బుక్కెడు బువ్వ చాలని, కబ్జా చేసిన పది వేల ఎకరాలు, దోచుకున్న వేల కోట్లు ఎందుకని ప్రశ్నించారు. పదేండ్లు అయినా డబుల్​బెడ్రూం ఇండ్లు కట్టించని అవినీతి కేసీఆర్​కుటుంబానికి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్లపల్లి జైలులో డుబుల్​బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్​ పార్టీని గెలిపించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు జిల్లా ప్రతిష్టతను పెంచాలని ఆయన కోరారు. 

కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. దళిత, బీసీ, మైనార్టీ బంధులు ఇవ్వని బీఆర్ఎస్​ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఆదివారం రాష్ర్టంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలు సీఎం కేసిఆర్​దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్​ నాయకులను అడ్డుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, షఖీల్​అహ్మద్, వంశీచంద్​రెడ్డి, జితేందర్, కర్నాటక విద్యాశాఖ మంత్రి సుధాకర్, కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలాజీ సింగ్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.