
న్యూఢిల్లీ : ప్రధానిగా రాహుల్ గాంధీనే తన ఛాయిస్ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఇండియా కూటమి ఓడిస్తే..మోదీ తర్వాత రాహులే దేశ ప్రధాని అవుతారని తెలిపారు. శుక్రవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే పలు విషయాలను పంచుకున్నారు. "రాయ్‌బరేలీ కాంగ్రెస్, గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. సోనియా గాంధీ వరుసగా ఐదు సార్లు గెలిచారు. హెల్త్ ఇష్యూస్ వల్ల ఈసారి రాజ్యసభకు వెళ్లారు. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని ప్రియాంకను కోరాం. కానీ, ఆమె నిరాకరించారు. దాంతో రాహులే బరిలోకి దిగాల్సి వచ్చింది" అని ఖర్గే తెలిపారు.
కూటమే నిర్ణయిస్తుంది
ఎన్నికలకు ముందు రాహుల్ రెండు భారత్ జోడో యాత్రలను నిర్వహించారని ఖర్గే తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా పాల్గొన్నారని వెల్లడించారు. అందువల్ల ప్రధాని పదవికి రాహులే పాపులర్ ఛాయిస్ అని అభిప్రాయపడ్డారు. యువతకు, దేశానికి ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం రాహుల్ కు ఉందన్నారు. అయితే, గెలిచిన తర్వాత ప్రధాని ఎవరనేదీ కూటమి నేతలే ఫైనల్ చేస్తారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ కు 128 సీట్లు వస్తయ్
కాంగ్రెస్ 128 సీట్లు గెలుచుకుంటుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 100 సీట్ల మార్కును అధిగమించామన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు ఢిల్లీ వేదికగా శనివారం సమావేశం కానున్నాయి.