ప్రధాని మోదీ మటన్, ముజ్రా, మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారు: ఖర్గే

ప్రధాని మోదీ మటన్, ముజ్రా, మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారు: ఖర్గే

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతుల గురించి కాకుండా మటన్, ముజ్రా, మంగళసూత్రం గురించే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారని కాంగ్రెస్  చీఫ్  మల్లికార్జున్  ఖర్గే మండిపడ్డారు. ‘మేకిన్  ఇండియా’ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ట్విట్టర్​లో ప్రశ్నించారు. మేకిన్  ఇండియా ఓ ఫెయిల్యూర్  అని, అందువల్లే దాని గురించి ప్రధాని మాట్లాడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. పదేండ్ల మోదీ పాలనను యూపీఏ పాలనతో పోల్చారు. ‘‘కాంగ్రెస్  ఆధ్వర్యంలోని యూపీఏ పాలనలో 2004 నుంచి 2014 వరకు మాన్యుఫ్యాక్చరింగ్  వృద్ధి 7.85 శాతం నమోదైంది.

అదే మోదీ హయాంలో 2014 నుంచి 2022 వరకు ఆ రంగంలో వృద్ధి 6 శాతమే. అలాగే మా హయాంలో 2004 నుంచి 2010 వరకు ఎగుమతి వృద్ధి 186.59 శాతం, 2009 నుంచి 2014  వరకు 94.39 శాతం నమోదైంది. 2014 నుంచి 2020 వరకు మోదీ పాలనలో ఎగుమతి వృద్ధి 21.14 శాతమే. 2019 నుంచి 2024 వరకు అది 56.86 శాతమే రికార్డయింది” అని ఖర్గే వివరించారు. ప్రధానిది ఫేక్  నేషనలిజం అని, చైనా నుంచి పెరుగుతున్న దిగుమతులే అందుకు నిదర్శనమని ఖర్గే ఫైర్  అయ్యారు. ‘‘తనది 56 ఇంచుల ఛాతీ అని, చైనా యాప్ లను బ్యాన్  చేశామని మోదీ చెప్పుకుంటారు.

కానీ, మన దేశ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా ఎదిగింది. చైనా విషయంలో ఆయన నిర్లక్ష్య ధోరణి వల్లే గల్వాన్ లో మన దేశ సైనికులు అమరులయ్యారు. 2020 జూన్ లో మన దేశానికి చైనా దిగుమతుల విలువ రూ.27 వేల కోట్ల నుంచి రూ.46 వేల కోట్లకు పెరిగింది. అంటే దిగుమతులు 68 శాతం పెరిగాయి” అని ఖర్గే పేర్కొన్నారు. దేశ ఎగుమతుల కన్నా దిగుమతులే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.