- మహాత్ముడి హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ను
- బ్యాన్ చేయాలని పటేల్ లేఖ రాశారు
- పటేల్, నెహ్రూ మధ్య సంబంధాలు
- సరిగా లేవంటూ చరిత్రను మోదీ వక్రీకరిస్తున్నారు
- పటేల్ వారసత్వాన్ని అవమానిస్తున్నారని ఫైర్
- వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ గొప్పనేతలు
- వారిద్దరూ దేశ ఐక్యతకు కృషి చేశారని వెల్లడి
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ది విష భావజాలమని, దేశంలో దాన్ని బ్యాన్చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది తన పర్సనల్ ఒపీనియన్ అని చెప్పారు. దేశంలో శాంతి భద్రతల సమస్యకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కారణమని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధం విధించారని, 2024లో దీన్ని బీజేపీ సర్కారు ఎత్తివేసిందని తెలిపారు. దాన్ని మళ్లీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. కాశ్మీర్ మొత్తాన్ని దేశంలో కలపాలని సర్దార్ పటేల్ కోరుకున్నారని, అందుకు అప్పటి ప్రధాని నెహ్రూ నిరాకరించారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఖర్గే తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చరిత్రను బీజేపీ వక్రీకరించింది.
సర్దార్ పటేల్ అప్పట్లో జన్‌సంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖను ఖర్గే ప్రస్తావించారు. మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన పరిస్థితిని ఆర్ఎస్ఎస్ సృష్టించిందని ఆ లేఖలో పటేల్ పేర్కొన్నట్టు తెలిపారు. ‘‘1948 ఫిబ్రవరి 4న ఆర్‌ఎస్‌ఎస్ గురించి సర్దార్ పటేల్ ఒక లేఖలో గాంధీజీ మరణాన్ని ఆర్‌ఎస్‌ఎస్ వేడుకగా జరుపుకున్నదని, స్వీట్లు పంచిందని రాశారు. దీని తర్వాత సంఘ్‌ను నిషేధించడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదు” అని వ్యాఖ్యానించారు.
సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారని, ఆయన సహకారం అపారమైనదని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వసించారని చెప్పారు. నెహ్రూ, సర్దార్ పటేల్ మధ్య విభేదాలున్నట్టు చిత్రిస్తూ.. చరిత్రను బీజేపీ వక్రీకరించిందని ఖర్గే మండిపడ్డారు. మహాత్మా గాంధీ, నాథూరామ్ గాడ్సే, ఆర్‌ఎస్‌ఎస్, 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలను ఎన్‌సీఈఆర్టీ పుస్తకాల నుంచి తొలగించారని, ప్రధాని సత్యాన్ని కూడా వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. నెహ్రూ, పటేల్ మధ్య చక్కటి సంబంధాలు ఉండేవని, ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకునే వారని తెలిపారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్, మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గొప్ప నేతలని ఖర్గే పేర్కొన్నారు. వారు దేశానికి ఎంతో సేవ చేశారని, దేశ ఐక్యతను కాపాడేందుకు
ఎంతో కృషి చేశారని కొనియాడారు.
