ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుంది : సోనియా గాంధీ

ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుంది : సోనియా గాంధీ

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే పార్టీలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఆయన ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి అని, కష్టించే తత్వంతో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్ష పదవి హోదాకు చేరుకున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్న సోనియా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యత అని చెప్పారు. తాను ఆ విధులను చిత్తశుద్ధితో, తన సామర్థ్యం మేరకు నిర్వర్తించడానికి ప్రయత్నించానని ఈ సందర్భంగా సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్న ఆమె.. వాటిని ఖర్గే సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నట్టు విశ్వాసం వ్యక్తం చేశారు. దానికి తమ పూర్తి సహాయ, సహకారాలుంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పదవీ పగ్గాలు చేపట్టిన ఖర్గేకు సోనియా అభినందనలు తెలియజేశారు. 

అంతకుమునుపు మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తనను సామాన్య స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకువచ్చింది పార్టీనేనన్నారు. పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లడమే తనముందు ఉన్న లక్ష్యమని వెల్లడించారు. బాధ్యతల నిర్వహణలో ప్రతిఒక్కరి సహకారం తీసుకుంటాని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా భాజపా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.