దేశం కోసం.. గెలిచి తీరాలి.. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి: ఖర్గే

దేశం కోసం.. గెలిచి తీరాలి.. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి: ఖర్గే
  • ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ పిలుపు 
  • బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తరు: రాహుల్ గాంధీ 
  • పేదల హక్కులు, రిజర్వేషన్లు పోతయని ఆందోళన  
  • ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నరని ఫైర్ 
  • అహంకారం చూపితే నాశనమైతరు: ప్రియాంక 
  • కేజ్రీవాల్ లేఖను చదివి వినిపించిన సునీత కేజ్రీవాల్ 
  • కూటమి తరఫున 6 గ్యారంటీలు ప్రకటన 
  • అరాచక శక్తులను ఓడిద్దాం: కల్పనా సోరెన్ 

న్యూఢిల్లీ: దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే దేశం మరింత నాశనం అవుతుందన్నారు. ‘‘మనమంతా ఏకమైతేనే బీజేపీపై పోరాడగలం. అలా కాకుండా మనలో మనమే కొట్లాడుకుంటే సక్సెస్ కాలేం. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి” అని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన ‘లోక్ తంత్ర్ బచావో ర్యాలీ’లో కూటమిలోని వివిధ పార్టీల నేతలు మాట్లాడారు. 

దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని.. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు వెంటనే ఆపాలంటూ ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఎన్నికల సంఘానికి 5 డిమాండ్లను చేశారు. సమావేశంలో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి రాసిన లేఖను ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. కూటమి తరఫున ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈడీ కేసుల్లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సంఘీభావంగా ‘లోక్ తంత్ర బచావో(సేవ్ డెమోక్రసీ)’ పేరుతో చేపట్టిన ఈ మెగా ర్యాలీకి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. 

మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నరు: రాహుల్ 

లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తుందని, ప్రజల హక్కులను హరిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇవి మామూలు ఎన్నికలు కావు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలు” అని ఆయన అన్నారు. ‘‘క్రికెట్ ఆటలో అంపైర్లు, క్యాప్టెన్ పై ప్రెజర్ పెట్టి.. ఆటగాళ్లను కొనేసి మ్యాచ్ గెలిచినప్పుడు దానిని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు.

ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ అలాగే జరుగుతోంది. అంపైర్లను ఎవరు సెలక్ట్ చేశారు? మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఇద్దరు ప్లేయర్లను అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నారు” అని రాహుల్ అన్నారు. బీజేపీ 400 సీట్లు గెలుస్తామని చెప్తోందని, కానీ ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, ప్రతిపక్ష పార్టీలపై ప్రెజర్లు, మీడియాను కొనడం వంటివి చేయకపోతే ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావన్నారు. దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఖాతాలన్నింటినీ ఫ్రీజ్ చేశారన్నారు. ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేశారని, ఇవేం తరహా ఎన్నికలని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ ముగ్గురు నలుగురు బిలియనీర్లతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 

బీజేపీ వస్తే రాజ్యాంగం పోతది.. 

రాజ్యాంగం ప్రజల గొంతుక అని, అది నాశనం అయిన రోజు దేశం కూడా నాశనమవుతుందని రాహుల్ హెచ్చరించారు. రాజ్యాంగం పోతే పేదల హక్కులు, రిజర్వేషన్లు కూడా పోతాయన్నారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన కామెంట్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘రాజ్యాంగం పోతే.. పేదలు, రైతులు, కార్మికుల సంపద అంతా ఐదారుగురి చేతుల్లోకి వెళ్తుంది. ఒకవేళ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ తో గెలిచి, రాజ్యాంగాన్ని మారిస్తే.. యావత్తు దేశమంతా మంటల్లో తగలబడిపోతుంది’’ అని ఆయన హెచ్చరించారు. 

సింహాన్ని ఎక్కువ రోజులుబంధించలేరు: సునీతా కేజ్రీవాల్  

నియంతృత్వం ఎల్లకాలం సాగదని, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఎక్కువ రోజులు జైలులో ఉంచలేరని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఆదివారం ఆమె తొలిసారిగా రాజకీయ వేదికపై మాట్లాడారు. ఈడీ కస్టడీ నుంచి  కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఈ సభలో సునీత చదివి వినిపించారు. ఇండియా కూటమి తరఫున దేశ ప్రజలకు ఆయన ఆరు గ్యారంటీలను ఇచ్చారని వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా కూటమి తరఫున ఈ ప్రకటన చేస్తున్నందుకు తనను క్షమించాలని నేతలను ఆమె కోరారు. ‘‘నేను ఈ రోజు మిమ్మల్ని ఓట్లు అడగను. ఎరినీ ఓడించాలని, గెలిపించాలనీ కోరను.

కానీ గొప్ప భారతదేశాన్ని నిర్మించడం కోసం 140 కోట్ల మంది సహకారాన్ని కోరుతున్నా. మీరు ఇండియా కూటమికి అవకాశం ఇస్తే ఈ బాధ్యత తీసుకుంటాం. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాం. నేడు ఇండియా కూటమి తరఫున ఆరు గ్యారంటీలను ప్రకటిస్తున్నా” అని కేజ్రీవాల్ రాసిన లేఖను సునీత చదివారు. తాను జైలులో బాగానే ఉన్నానని, అరెస్టుతో తన ధైర్యం మరింత పెరిగిందని కేజ్రీవాల్ రాసినట్లు ఆమె తెలిపారు. ‘‘కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆయన రిజైన్ చేయాల్నా? ఆయన అరెస్టు న్యాయమేనా? ఆయన సింహం. ఆయనను ఎక్కువ రోజులు కటకటాల వెనక ఉంచలేరు” అని సునీత అన్నారు.

అరాచక శక్తులను ఓడిద్దాం: కల్పనా సోరెన్ దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు, 9 శాతం ఉన్న గిరిజనుల గొంతుకగా నిలిచేందుకే తాను ఇక్కడికి వచ్చానని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ అన్నారు. ‘‘మేం గిరిజనులం. మాకు సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల చరిత్ర ఉంది. మా చరిత్ర పట్ల మేం గర్విస్తాం. ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు అరాచకశక్తులు ప్రయత్నిస్తున్నాయనేందుకు ఇక్కడికి తరలి వచ్చిన వేలాది మంది జనమే సాక్ష్యం. ఆ అరాచకత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకే వీరంతా ఇక్కడికి వచ్చారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు”అని ఆమె మండిపడ్డారు.  

బీజేపీ అంటే.. ‘భ్రష్ట్ జనతా పార్టీ’: ఉద్ధవ్ థాక్రే 

ఎలక్టోరల్ బాండ్ల స్కాంతో బీజేపీ అత్యంత అవినీతి పార్టీగా అవతరించిందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని, ఇప్పుడు బీజేపీ అంటే ‘భ్రష్ట్ జనతా పార్టీ’ అంటూ అభివర్ణించారు.  దేశంలో అరాచకం పెరిగిందని, ఆయనను గద్దె దింపాలని ఉద్ధవ్ థాక్రే పిలుపునిచ్చారు. ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదని, తమ భర్తల కోసం పోరాడుతున్న ఇద్దరు చెల్లెండ్లు సునీత, కల్పనకు సంఘీభావం తెలిపేందుకే వచ్చామన్నారు.  

స్టేజీపై రెండు కుర్చీలు ఖాళీగా..

సభా వేదికపై సీఎం కేజ్రీవాల్ భార్య సునీత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన కూడా ఆసీనులయ్యారు. అయితే స్టేజీపై కేజ్రీవాల్, సోరెన్​లకు గుర్తుగా రెండు కుర్చీలను ఖాళీగా ఉంచారు.  

మెగా ర్యాలీకి వచ్చిన నేతలు వీరే.. 

లోక్ సభ ఎన్నికలకు ముందుగా ప్రతిపక్ష ఇండియా కూటమి చేపట్టిన ‘లోక్ తంత్ర బచావో’ ర్యాలీకి కూటమిలోని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్​లు సోనియా, రాహుల్, ఎన్ సీపీ (శరత్ చంద్ర పవార్) నేత శరద్ పవార్, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి, సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తది తరులు హాజరయ్యారు. అయితే, వెస్ట్​ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గైర్హాజరు కాగా, ఆమె తరఫున టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ర్యాలీకి వచ్చారు.

అహంకారం బద్దలైతది: ప్రియాంక

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అహంకారం చూపితే నాశనం తప్పదని వెయ్యి ఏండ్ల రామాయణ గాథ చాటి చెప్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. లోక్ తంత్ర బచావో ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘‘రామ్ లీలా మైదాన్​లో ఏటా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. చిన్నతనంలో నేను మా నాన్నమ్మతో కలిసి ఇక్కడికి వచ్చేదాన్ని. అప్పుడు ఆమె నాకు రామాయణం గురించి వివరించేవారు.

నేడు అధికారంలో ఉన్నవాళ్లు తమను తాము రామభక్తులుగా చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను వారికి వెయ్యేండ్ల రామాయణ గాథ, దాని సందేశాన్ని చెప్పదల్చుకున్నా. రాముడు సత్యం కోసం పోరాటం చేసినప్పుడు ఆయన వద్ద అధికారం, సైన్యం, కనీసం ఒక రథం కూడా లేదు. రావణుడి దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ రాముడి వద్ద సత్యం, ఆశ, నమ్మకం, ప్రేమ, దయ, సహనం, ధైర్యం ఉన్నాయి. నేను ప్రధాని నరేంద్ర మోదీకి, అధికారంలో ఉన్న ఇతర నేతలకు చెప్పేదేంటంటే.. అధికారం అనేది శాశ్వతం కాదు. అహంకారం బద్దలైపోతుంది” అని ప్రియాంక హితవు పలికారు.   

బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషంలాంటివి: ఖర్గే 

ఆర్ఎస్ఎస్, బీజేపీ విషంలాంటివని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్ష పార్టీలను, నేతలను బెదిరించేందుకు ప్రధాని మోదీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషంలాంటివి. వాటిని రుచి చూడరాదు. వాళ్లు దేశాన్ని నాశనం చేశారు” అని ఖర్గే ఫైర్​ అయ్యారు. ‘‘ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవు.

ప్రధాని మోదీ మైదానాన్ని తవ్వేసి.. ప్రతిపక్షాలను క్రికెట్ ఆడాలని చెప్తున్నారు. ఇటీవల ఓ మీటింగ్ లో బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా కలిసినప్పుడు ఆయనకు ఇదే విషయం చెప్పాను. ఆల్రెడీ కాంగ్రెస్ ఫండ్స్ ను స్తంభింపచేశారని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని స్పష్టం చేశాను” అని ఖర్గే తెలిపారు. ‘‘ట్యాక్స్ పెనాల్టీ పేరుతో కాంగ్రెస్ కు చెందిన 12 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. రూ. 14 లక్షల నగదు డిపాజిట్లపై రూ. 135 కోట్ల పెనాల్టీ నోటీసులు ఇచ్చారు. కానీ బీజేపీపై మాత్రం చర్యలు తీసుకోలేదు. బీజేపీ ఖాతాల్లోకి రూ. 42 కోట్లు కూడా ఇలాగే వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం ఆ పార్టీపై రూ. 4,600 కోట్ల పెనాల్టీ వేయాలి. కానీ అలా చేయకపోవడాన్ని దోపిడీ కాక ఇంకేమనాలి?” అని ఆయన ప్రశ్నించారు.  

ఈసీకి ఇండియా కూటమి

5 డిమాండ్లు ఇవే..


1. లోక్ సభ ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలి. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల విషయంలోనూ సమానంగా వ్యవహరించాలి. 
2. ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులను వెంటనే ఆపివేయించాలి. 
3. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను వెంటనే జైలు నుంచి విడుదల చేయించాలి. 
4. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ఆర్థిక వనరులను దెబ్బ తీసే ప్రయత్నాలను వెంటనే ఆపివేయించాలి. 
5. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ ఖాతాలోకి భారీగా ఫండ్స్ చేరడంపై దర్యాప్తు చేపట్టాలి. ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు చేయాలి. 

కేజ్రీవాల్ ఇచ్చిన 6 గ్యారంటీలు.. 


1. దేశమంతటా 24x7 విద్యుత్ సరఫరా
2. పేద వర్గాలకు పూర్తిగా ఉచిత విద్యుత్ 
3. ప్రతి గ్రామం, లొకాలిటీలో
అద్భుతమైన ప్రభుత్వ బడులు 
4. ప్రతి గ్రామం, లొకాలిటీలో
మొహల్లా క్లినిక్ లు 
5. స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం అన్ని పంటలకు తగిన ఎంఎస్పీ
6. ఢిల్లీకి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా

కుటుంబాన్ని రక్షించండి.. అవినీతిని కప్పిపుచ్చండి
ఇదే ఇండియా కూటమి పరిరక్షణ ర్యాలీ అంటూ బీజేపీ విమర్శలు

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది ప్రజస్వామ్య పరిరక్షణ ర్యాలీ కాదని.. ‘కుటుంబాన్ని రక్షించండి.. అవినీతిని కప్పిపుచ్చండి’ అనే కార్యక్రమమని ఎద్దేవా చేసింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి ఈ ర్యాలీని నిర్వహించింది. దీనిపై ఆదివారం బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ‘‘కొందరు ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అని మాట్లాడుతున్నరు.

1974లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తమిళనాడు, దేశ ప్రజల ప్రయోజనాలపై రాజీ పడి.. కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించింది. కాంగ్రెస్ మొదటి కుటుంబానికి లబ్ధి కోసమే ఇలా చేసింది. రాహుల్ గాంధీజీ.. మీ కుటుంబమే డీల్ ఫిక్సింగ్ కు పాల్పడింది” అంటూ ఆయన విమర్శించారు. బీజేపీ మరో అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై అవినీతి కేసులు ఉన్నాయన్నారు.

గతంలో రామ్ లీలా మైదానం అన్నా హజారే నాయకత్వంలో ‘ఇండియా అగైనిస్ట్ కరప్షన్’ ఉద్యమానికి వేదిక కాగా.. ప్రస్తుతం ఇదే మైదానంలో అవినీతిపరులు ర్యాలీని నిర్వహించారన్నారు. ప్రజలు ఎవరినైతే దొంగలు, ద్రోహులుగా పిలుస్తున్నారో వారితో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేతులు కలిపారని.. ఇది ఒక విచిత్రమైన సంఘటన అని అన్నారు. తమ పాత నేరాలన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు పార్టీలన్ని ఏకతాటిపైకి వచ్చాయని విమర్శించారు. రామ మందిర నిర్మాణాన్ని ఆ పార్టీలన్ని వ్యతిరేకించాయని మండిపడ్డారు. హిందూయిజాన్ని నాశనం చేయాలని కొన్ని పార్టీలు పిలుపునిచ్చాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఒకే వేదిక పైకి వచ్చామని ఆ పార్టీలు చెప్పుకుంటున్నాయని.. కానీ, అవి వారసత్వ సంస్థలన్ని ఇతరులను ఎదగనీయవన్నారు.