కేసీఆర్​ సభకు రాకపోవడం.. ప్రజలను అవమానించినట్టే

కేసీఆర్​ సభకు రాకపోవడం.. ప్రజలను అవమానించినట్టే
  • ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి

హైదరాబాద్, వెలుగు :  ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్​ అపహాస్యం చేస్తున్నారని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగు తుంటే ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్​.. సభకు హాజరుకాకపోవడం ప్రజలను అవమానపర్చి నట్టేనని ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కీలకమైన బడ్జెట్​ సమావేశాలకు హాజరు కాకుండా.. 

బయట సభలు పెట్టి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. మాట్లాడేందుకు ఎంత సమయమైనా ఇస్తామని చెప్తున్నప్పటికీ.. కేసీ ఆర్​ సభకు రాకుండా మొహం చాటేయడం దారుణమన్నారు. నల్గొండలో సభ పెట్టి చెప్ప డం కన్నా.. అసెంబ్లీకి వచ్చి ఏం చెప్పా లనుకున్నారో చెప్పొచ్చు కదా అని నిలదీశారు. 

కృష్ణా జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్​కు, బీఆర్​ఎస్​ పార్టీకి లేదన్నారు. కృష్ణా జలాలను భారీగా ఏపీకి తరలిస్తున్నా కేసీఆర్​ చూస్తూ కూర్చున్నారని ఆరోపించారు. కేఆర్​ఎంబీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాస్తవాలను దాచేస్తున్నారన్నారు.