పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారు: మల్లురవి

పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారు: మల్లురవి

వార్ రూమ్ పై పోలీసుల దాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేశారని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పై దాడి చేయడంతో  నేతలంతా ఐక్యంగా పోరాటం చేశారని కొనియాడారు. మాణిక్కం ఠాగూర్ నుండి కింది స్థాయి కేడర్ వరకు అందరూ ప్రభుత్వ తీరుపై గళం విప్పారని తెలిపారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చట్టాలకు లోబడి పనిచేయాలి... కానీ టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సునీల్ కనుగోలు కాంగ్రెస్ కోసం సర్వేలు చేస్తున్నారని..పబ్లిక్ నాడీ తెలుసుకుంటారని పేర్కొన్నారు. 

సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ ల కోసమే వార్ రూమ్ పై పోలీసులు దాడి చేశారని మల్లు రవి చెప్పారు. ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు చేసినోళ్ల పేర్లు చెప్పకుండా రైడ్ చేయడం సరికాదన్నారు. కంప్యూటర్లు, ల్యాబ్ టాప్లు, సీపీయూలు,సెల్ ఫోన్లు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఎలాంటి కారణం చెప్పకుండా ముగ్గురిని అరెస్ట్ చేశారని..హెబియస్ కార్పస్ పిటిషన్ హై కోర్టులో వేశామన్నారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు వింటున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ సర్వేలు ఎత్తుకెళ్లినా ఏమీ కాదని..సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిజాంకు రజాకార్లు ఎట్లా పనిచేశారో.. కేసీఆర్ కు  పోలీసులు అలా పనిచేస్తున్నారు.