సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా

సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా

కోల్ కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) టచ్ చేసే ధైర్యం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మమతా బెనర్జీకి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టం కింద హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.  మంగళవారం బెంగాల్​లో షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోకి చొరబాటుదార్లను ‘దీదీ’ ఆపలేకపోతున్నారని ఆరోపించారు. ‘‘చొరబాటుదార్లను నిలవరించడం మోదీకి మాత్రమే సాధ్యం. చివరిసారి మాకు 18 ఎంపీ సీట్లు ఇస్తే మోదీ రామ మందిరాన్ని ఇచ్చారు. ఇప్పుడు 35 సీట్లు ఇవ్వండి. చొరబాట్లను ఆపుతాం” అని చెప్పారు. సందేశ్ ఖాలీ ఘటనపై కూడా ఆయన స్పందించారు. ‘‘ఓటు బ్యాంక్‌‌పై దృష్టిపెట్టిన మమతాబెనర్జీ.. సందేశ్‌‌ఖాలీలో మహిళలను వేధించినా పట్టించుకోలేదు. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు నిందితులు జైల్లో ఉన్నారు” అని పేర్కొన్నారు.  టీచర్​ రిక్రూట్​మెంట్​స్కామ్​ను ప్రస్తావిస్తూ..‘ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల వరకు వసూలు చేశారు. బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ నివాసంలో రూ.51 కోట్లు దొరికాయి’ అని చెప్పారు. బీజేపీకి ఓటేయండి.. ‘దీదీ’ గుండాలను తలకిందులుగా వేలాడదీస్తామని అమిత్​ షా చెప్పారు.