మా సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నాలు: మమతా బెనర్జీ

 మా సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నాలు: మమతా బెనర్జీ

ఆరంబాగ్ :  తప్పుడు ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సోమవారం ఆరంబాగ్ హుగ్లీ జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఆర్థికంగా అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ పేదల ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టగలిగామని తెలిపారు.

 ‘‘రాష్ట్రానికి నిధులు అందించకుండా కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ, రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టగలిగాం. ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి ఎన్నో పనులు చేస్తున్నాం. దేశంలోని ఏ రాష్ట్రం అభివృద్ధి విషయంలో మనతో పోటీపడలేదు. అయినప్పటికీ, తప్పుడు ఆరోపణలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు”అని మమత చెప్పారు. 

కొన్నేండ్లుగా టీఎంసీకి చెందిన అనేక మంది నాయకులను అవినీతి ఆరోపణలతో  కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తుండటంతో మమత ఈ విధంగా ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రానికి నిధులు అందించకుండా కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తుందని దీదీ విమర్శించారు. కేంద్రం నుంచి  రూ.1.18లక్షల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వాటిని అందించకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని మమత మండిపడ్డారు.