నేతాజీ జయంతిని ఎందుకు నేషనల్ హాలిడేగా ప్రకటించలే? : బెంగాల్ సీఎం మమత

నేతాజీ జయంతిని ఎందుకు నేషనల్ హాలిడేగా ప్రకటించలే? :  బెంగాల్ సీఎం మమత
  •     ఫ్రీడం ఫైటర్ల కలలను బీజేపీ నాశనం చేసింది
  •     కేంద్రంపై బెంగాల్ సీఎం మమత ఫైర్

కోల్ కతా: నేతాజీ సుభాష్  చంద్రబోస్, రవీంద్రనాథ్  ఠాగూర్, అంబేద్కర్, గాంధీ వంటి జాతీయ నేతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదేపనిగా అవమానిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా నేతాజీ పోరాడారని గుర్తుచేస్తూ.. ఆయన జయంతిని జాతీయ సెలవుదినంగా ఎందుకు ప్రకటించలేదని కేంద్రాన్ని నిలదీశారు. శుక్రవారం బోస్  జయంతి సందర్భంగా కోల్ కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడారు. దేశ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ‘‘జాతీయ నేతలపై కేంద్రానికి కృతజ్ఞత లేదు. వారిపై అసహనంగా ఉన్నారు. వారి గురించి అదేపనిగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి కలలను నాశనం చేస్తున్నారు. 

ఇలాంటి వైఖరిని బెంగాల్  అంగీకరించదు. స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ ‘చలో ఢిల్లీ’ కి పిలుపునిచ్చారు. ఇప్పుడు అలాంటి ఢిల్లీ (కేంద్రం) బెంగాల్ పై కుట్రచేస్తోంది. ఆ నగరం ఒక కుట్రల నగరంగా మారింది. మేమంతా ఒక్కటై కేంద్రంపై పోరాడి బెంగాల్  భాష, సంస్కృతిని కాపాడుకుంటాం” అని మమత వ్యాఖ్యానించారు. దేశ చరిత్రతో సంబంధంలేని చరిత్రను రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. రాజ్యాంగాన్ని కూడా అవమానిస్తున్నారని, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఫైర్  అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని వివస్త్రగా చేస్తున్నారని కేంద్రంపై దీదీ ధ్వజమెత్తారు.

బోస్  ఫైళ్లను బహిర్గతం చేయాలి

నేతాజీ సుభాష్ చంద్రబోస్  నేడు బతికి ఉంటే, ఆయనకు కూడా ఎన్నికల సంఘం నోటీసులు పంపేదని మమత ఎద్దేవా చేశారు. తాను భారతీయుడినని నిరూపించుకోవాలని బోస్ ను ఈసీ అడిగేదని విమర్శించారు. 

నేతాజీ మునిమనుమడు చంద్రకుమార్ బోస్ కు ఈసీ పంపిన నోటీసులు ఇందుకు నిదర్శనమని చెప్పారు. బెంగాల్ లో ఈసీ చేపట్టిన సర్  ప్రక్రియ కారణంగా ఆందోళనతో ఇప్పటివరకూ 110 మందిపైనే చనిపోయారని, ఈ మరణాలకు ఈసీ, కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు. సెంట్రల్  ఆర్కైవ్  నుంచి నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని ఆమె డిమాండ్  చేశారు.