జై శ్రీరామ్ అంటే మమతకు చిరాకెందుకో?

జై శ్రీరామ్ అంటే మమతకు చిరాకెందుకో?

కోల్‌‌కతా: భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పరాక్రమ్ దివస్‌‌ను జరుపుకున్నారు. కోల్‌‌కతాలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సభలో మాట్లాడిన తీరు చర్చనీయాంశం అవుతోంది. మమత స్టేజ్ మీదకు వస్తున్న సమయంలో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. దీంతో ఆమె సీరియస్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా పిలిచి ఇలా అవమానిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు.

ఈ విషయంపై నేతాజీ మునిమనుమడు, బీజేపీ నేత సీకే బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో జైశ్రీరాం నినాదాలు మమతకు అలర్జీని కలిగించి ఉంటాయన్నారు. ‘ఏకత్వానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కట్టుబడి ఉన్నారు. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌‌లో అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. జై హింద్ అన్నా.. జై శ్రీరామ్ అన్నా పెద్ద తేడా లేదు. జై శ్రీరామ్ అనే నినాదానికి ఏదో అలర్జీ, చిరాకు వచ్చినట్లు ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఇలాంటి రోజున రాజకీయాలు చేయడం సరికాదు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. ఆర్మీ అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన రోజు ఇది’ అని సీకే బోస్ పేర్కొన్నారు.