
హనుమకొండ, వెలుగు: వరంగల్ రైతు డిక్లరేషన్ నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండ ఎన్జీవోస్ కాలనీలోని ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రుణమాఫీ సగం మంది రైతులకు కూడా రాలేదని, అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా కౌలు రైతులకు ఇస్తామన్న ఇందిరమ్మ రైతు భరోసా ఏమైందని ఆమె ప్రశ్నించారు.
ధరణి తో అవినీతి జరిగిందని, భూ భారతి తీసుకొచ్చారని, కానీ అది ఎక్కడా అమలు కావడం లేదన్నారు. మామునూరు ఎయిర్ పోర్టుకు రాణిరుద్రమ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని, వెంటనే కేంద్ర మంత్రితో పాటు సీఎంకు కూడా లేఖ కూడా రాస్తానని వెల్లడించారు. ఆగస్టు 6న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజన తెలంగాణ జాగృతి వార్షికోత్సవాన్ని ఓరుగల్లులో నిర్వహిస్తామన్నారు. అదే రోజు రాష్ట్ర శాఖలు కూడా ప్రకటిస్తామని, అన్నిచోట్లా జాగృతిని బలోపేతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.