
- అడ్డొచ్చిన గ్రామస్తులను చంపుతామని బెదిరింపు
- 30 మందిని అరెస్ట్ చేసిన మామునూరు పోలీసులు
ఖిలా వరంగల్ (మామునూరు) వెలుగు : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో జేసీబీతో ఇల్లు కూల్చి వేసి, అడ్డుకోబోయిన గ్రామస్తులను చంపుతామని బెదిరించి బీభత్సం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. బొల్లికుంటకు చెందిన సోల్తి రాజాగౌడ్, సోల్తి రామస్వామి, ఇంద్రసేనారెడ్డి మధ్య నెలకొన్న 7 ఎకరాల భూమి వివాదంపై జిల్లా కోర్టుకు వెళ్లారు. 2021లో జిల్లా కోర్టు సోల్తి రాజా గౌడ్, సోల్తి రామస్వామి గౌడ్ లకు చెందుతుందని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఇంద్రసేనారెడ్డి హైకోర్టుకు వెళ్లాడు.
రెండు నెలల కింద హైకోర్టు తనకు తీర్పు ఇచ్చిందని, ఆ భూమి తనదేనని ఆదివారం తన కుటుంబసభ్యులతో పాటు 100 మంది అనుచరులను, జేసీబీని తీసుకొని తీసుకుని వెళ్లాడు. భూమిలోని ఇంటికి కూల్చివేస్తుండగా.. అడ్డుకోబోయిన చంపుతామని బెదిరించారు. సీసీ కెమెరాలను, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారు. సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా ఎవరైనా అడ్డొస్తే ఇదే గతి పడుతుందని, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఇంద్రసేనారెడ్డి, అతని అనుచరులు హెచ్చరించారు.
గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి వెళ్లగానే పరార్ అయ్యారు. 30 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఇంద్రసేనారెడ్డి అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మామునూరు సీఐని వివరణ కోరగా దొంతి ఇంద్రసేనా రెడ్డి, అతని కుటుంబ సభ్యులు, అనుచరులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.