రైల్వే క్రాసింగ్ మూసేసినప్పుడు బైక్ పై పట్టాలు దాటితే..

రైల్వే క్రాసింగ్ మూసేసినప్పుడు బైక్ పై పట్టాలు దాటితే..

నిర్లక్ష్యంతో వ్యవహరించి  వాహనదారులు, పాదచారులు  రైలు ప్రమాదాల బారిన పడొద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరు డోంట్ కేర్ అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఇటావాలో రైల్వే క్రాసింగ్ ను ఓ వ్యక్తి బైక్ పై దాటేందుకు ప్రయత్నించాడు. అక్కడున్నవారంతా రైలు వస్తుందని ముందుకు వెళ్లొద్దని వారించినా వినిపించుకోలేదు. రైలు పట్టాలను క్రాస్ చేసేందుకే ముందుకు వెళ్లాడు. అదే సమయంలో అటువైపు నుంచి  వేగంతో వస్తున్న రైలును చూసి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ బైక్ మాత్రం పట్టాలపై పడిపోయింది.  దాన్ని బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ అది ఫలించలేదు. స్పీడ్ గా వచ్చిన రైలు ఆ బైక్ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. జార్ఖండ్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ రైల్వే క్రాసింగ్ వద్దకు అతివేగంతో రావడం చూసి బైక్ ను వదిలిపెట్టి పట్టాలపై నుంచి ప్రాణాలను దక్కించుకునేందుకు పరుగులు పెట్టాడు. ఇదంతా కొద్ది క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. అదృష్టం ఏమిటంటే అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

మరికొందరు బైకర్లు కూడా  రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు ప్రయత్నించి వెనక్కి తగ్గారు.మరో ట్రాక్ పై రైలు వస్తుండటంతో పలువురు పాదచారులు బయటకు వచ్చేవారు. రైలు కింద పడ్డ బైక్ నుజ్జునుజ్జు అయ్యింది.   బైక్ పార్ట్స్ ముక్కలు ముక్కలు అయ్యాయి. రైల్వే క్రాసింగ్ మూసివేసినప్పుడు కూడా బైకర్ పట్టాలు దాటడానికి ప్రయత్నించాడని పోలీసులు అతడికి నోటీసు జారీ చేసినట్టు తెలిసింది. అతడిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి.