
మహబూబాబాద్, వెలుగు: తాగి గొడవ చేస్తున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే తాళ్లతో కట్టేసి కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ అతడు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పీఎస్‌ఆర్ జెండాల్ తండాలో బుధవారం వెలుగుచూసింది. మరిపెడ సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ కిషన్ (48) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు.
మద్యానికి బానిస అయిన కిషన్ ప్రతి రోజు తాగి వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య కావ్య, చిన్న కుమార్తె పల్లవి, ఇతర కుటుంబసభ్యులు కలిసి ఈ నెల 16న కిషన్ కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణరహితంగా కొట్టారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మంగళవారం రాత్రి చనిపోయాడు.
మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే ఆస్తి కోసమే కిషన్‌ను హత్య చేశారని స్థానికులు తండావాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిషన్‌కు కావ్యతో 25 ఏండ్ల కింద పెండ్లి కాగా.. అప్పటి నుంచి అత్తగారి ఊరైన పీఎస్‌ఆర్ జెండాల్ తండాలోనే ఉంటూ అత్తింటి వారు ఇచ్చిన ఐదు ఎకరాలను సాగు చేసుకుంటున్నాడు.
కిషన్ చిన్న కుమార్తె పల్లవి ఇటీవల అదే తండాకు చెందిన సురేశ్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో కిషన్ పేరున ఉన్న భూమిని సాదాబైనామా ద్వారా సురేశ్ తన బంధువుల పేరిట మార్చుకున్నట్లు తెలిసింది. భూమి కోల్పోవడం వల్లే కిషన్ తాగుడుకు బానిస అయ్యాడని, అటు భూమికి, ఇటు పెండ్లికి అడ్డొస్తున్నాడనే కుమార్తె పల్లవి, సురేశ్‌తో కలిసి కిషన్‌ను హత్య చేసినట్లు
అనుమానిస్తున్నారు.