రెచ్చిపోయిన ప్రేమోన్మాది... మృతురాలి బంధువులు పీఎస్​ ఎదుట ఆందోళన

రెచ్చిపోయిన ప్రేమోన్మాది... మృతురాలి బంధువులు పీఎస్​ ఎదుట ఆందోళన

వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెచ్చిపోయిన ఓ ప్రేమోన్మాది ... ప్రియురాలి కుటుంబాన్ని కిరాతకంగా హత్య చేశాడు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని .. మృతురాలి బంధువులు  నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా రాస్తారోకో  చేశారు.  అయితే ఆందోళనను పోలీసులు అడ్డుకొనేందుందకు ప్రయత్నించగా .. ఆందోళనకారులు పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. 

ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ఓ యువకుడు ఉన్మాదిగా మారి యువతి తల్లిదండ్రులను హతమార్చిన ఘటన చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో చోటుచేసుకుంది. బానోతు శ్రీనివాస్‌(45), బానోతు సుగుణ (40) దంపతులు పదహారు చింతల తండాలో నివాసముంటున్నారు. వారి కుమార్తె దీపికను గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు గత నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హనుమకొండలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. 

తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో బన్నీ ఉన్మాదిగా మారాడు.  తెల్లవారుజామున ఇంటి ముందు నిద్రిస్తున్న శ్రీనివాస్‌, సుగుణ దంపతులపై దాడికి పాల్పడ్డాడు. సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. ఈ ఘటనలో దీపిక, ఆమె సోదరుడు మదన్‌లాల్‌ కూడా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్‌, నెక్కొండ సీఐ చంద్రమోహన్‌ పర్యవేక్షణలో చెన్నారావు, గూడూరు, నెక్కొండ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామంలో బందోబస్తు నిర్వహించారు.