పచ్చని కాపురంలో చిచ్చు రేపిన ఇన్స్టా

పచ్చని కాపురంలో చిచ్చు రేపిన ఇన్స్టా
  • ఇన్​స్టా ప్రేమికుడి కోసం విడాకులు కోరిన భార్య
  • బ్లేడుతో ఆమెపై దాడి చేసి, తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త

జీడిమెట్ల, వెలుగు: పచ్చని కాపురంలో ఇన్​స్టా పరిచయం చిచ్చు పెట్టింది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న భర్తను, ముగ్గురు మగపిల్లలను కాదని ఇటీవల ఇన్​స్టాగ్రామ్​లో పరిచమైన ప్రియుడి వద్దకు వెళ్లేందుకు ఓ మహిళ సిద్ధమైంది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త బ్లేడ్​తో ఆమెపై దాడి చేసి అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. సీఐ నర్సింహా తెలిపిన ప్రకారం...  కరీంనగర్​ వీణవంకకు చెందిన వాసాల శ్రీధర్(34), ఖమ్మంకు చెందిన కల్యాణి  ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు మగ పిల్లలు. శ్రీధర్​ జీవనోపాధి కోసం జగద్గిరిగుట్టకు వచ్చి ఎల్లమ్మబండ, పీజేఆర్​ కాలనీలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. 

ఇటీవల కల్యాణికి ఇన్​స్టాగ్రామ్​లో ఓ యువకుడితో పరిచయమైంది. తరచూ అతడితో మాట్లాడుతోంది. ఈ విషయాన్ని గమనించిన భర్త  పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు నచ్చజెప్పాడు. కల్యాణి భర్త మాట పట్టించుకోలేదు. సోమవారం తాను ఆ యువకుడితో వెళ్లిపోతానని, విడాకులు ఇవ్వాలని భర్తతో గొడవపడింది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీధర్​ బ్లేడ్​తో ఆమె మెడ, ముఖం, చేతులపై విచక్షణారహితంగా దాడిచేశాడు. అనంతరం తానూ చనిపోతానంటూ శ్రీధర్​ తన రెండు చేతులను అదే బ్లేడ్​తో మణికట్టు వద్ద కోసుకున్నాడు. గాయాలపాలైన ఇద్దరిని స్థానికులు కూకట్​పల్లిలోని ఓ హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.