నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నర్సాపూర్ ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు చెందిన సల్మా బేగం, యూపీకి చెందిన షారుఖ్ అన్సారి(24) ఆరేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకొని నర్సాపూర్‌లో నివాసం ఉంటున్నారు.
సల్మా బేగం, అప్సా బేగం ఇద్దరూ క్లాస్మేట్స్ కావడంతో షారుఖ్ అన్సారీతో సన్నిహితంగా ఉండేవారు. సల్మా బేగం డెలివరీ కోసం దోమడుగుకు వెళ్లగా, అప్సాబేగం భర్త జహీరాబాద్ పట్టణానికి చెందిన షబ్బీర్ వేరే కేసులో జైలుకు వెళ్లాడు. ఈక్రమంలో నర్సాపూర్ లోని తల్లి ఇంటి వద్ద ఉంటున్న అప్సా బేగంతో అన్సారి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. అన్సారీని చంపితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించి రాత్రి 10 గంటలకు పట్టణంలోని రాయరావు చెరువు వద్దకు రావాలని అన్సారీకి అప్సా బేగంతో ఫోన్ చేయించారు. అక్కడికి వచ్చిన అన్సారీని పాషా, అంబదాస్, రేష్మా బేగం పట్టుకోగా షబ్బీర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటనా స్థలాన్ని తూప్రాన్ డీఎస్పీ నాగేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి పరిశీలించారు. మృతుడి భార్య సల్మా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
