నిమజ్జనోత్సవాల్లో విషాదాలు .. డ్యాన్స్​ చేస్తూ గుండెపోటుతో మృతి

నిమజ్జనోత్సవాల్లో విషాదాలు ..   డ్యాన్స్​ చేస్తూ గుండెపోటుతో మృతి
  •  భద్రాచలంలో చెరువులో మునిగి బాలుడు గల్లంతు 
  • జమ్మికుంటలో కింద పడిన భారీ గణనాథుడు

పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండ లం పాతకారాయిగూడెంలో గణేశ్​శోభాయాత్రలో డాన్స్​ చేస్తూ గుండెపోటుతో ఒకరు చనిపోయారు. దూదిపాళ్ల సత్యనారాయణ (50)  ఊరిలో బుధవారం రాత్రి నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నాడు. యువకులతో కలిసి డ్యాన్స్ ​చేస్తూ గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. తిరువూరులోని ప్రైవేట్​దవాఖానకు తరలించగా అప్పటికే  మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య , కూతురు, కొడుకు ఉన్నారు. 

గోదావరికి వెళ్లిన బాలుడు 

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరిలో గురువారం జరిగిన నిమజ్జన వేడుకల్లో టేకులపల్లి మండలం వీర్య తండాకు చెందిన 14 ఏండ్ల బాలుడు లకావత్ గణేశ్​ ​గల్లంతయ్యాడు. నిమజ్జనం తర్వాత స్నానం చేసేందుకు ఫ్రెండ్స్​ బానోతు  ​రాంచరణ్​,  బానోతు గణేశ్ తో కలిసి స్నానఘట్టాల వద్ద గోదావరిలో దిగాడు.​ ముగ్గురూ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా ఎన్డీఆర్​ఎఫ్​ టీం సభ్యులు, పోలీసులు, గజ ఈతగాళ్లు చరణ్, బానోతు గణేశ్​ను కాపాడారు. లకావత్ గణేశ్​​ఆచూకీ దొరకలేదు. భద్రాచలంలో బుధవారం రాత్రి శోభాయాత్రలో పటాకులు కాల్చడంతో పాత కూరగాయల మార్కెట్​లో ఫుట్ పాత్​పై ఉన్న గుడిసెతో పాటు, బార్బర్ ​షాపులు తగులబడి పోయాయి. ఫైర్ ​ఇంజిన్ వచ్చి మంటలార్పడంతో ఇతర షాపులకు ముప్పు తప్పింది.  

చేతిలో పటాకులు పేలి గాయాలు

వైరా : వైరా మండలంలోని కొణిజర్లలో ఊరేగిం పు సందర్భంగా రాయల నాగయ్య చేతిలో పట్టుకుని పటాకులు పేల్చుతుండగా పేలి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హైదరాబాద్ ​తరలించారు. 
 
కింద పడిన విగ్రహం ..తప్పిన ప్రమాదం

జమ్మికుంట : కరీంనగర్​ జిల్లా జమ్మికుంట పరిధిలోని మోత్కుల గూడెంలో 22 అడుగుల వినాయక విగ్రహం నిమజ్జనం చేసేందుకు తరలిస్తుండగా కింద పడిపోయింది. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ తీగలు అడ్డువస్తున్నాయని క్రేన్​తో విగ్రహాన్ని పైకి కిందికి కదుపుతుండగా ట్రాక్టర్ నుంచి కింద పడిపోయింది. అధికారులు, సిబ్బంది విగ్రహాన్ని తాళ్లతో కట్టి క్రేన్ తో నిమజ్జనం చేశారు.