జల ప్రళయంలో బురదలో నుంచి బయటపడిన ఒకే ఒక్కడు

జల ప్రళయంలో బురదలో నుంచి బయటపడిన ఒకే ఒక్కడు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామాన్ని జల ప్రళయం ముంచెత్తింది. మంగళవారం (ఆగస్ట్ 5) మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన క్లౌడ్ బరస్ట్ వల్ల కొండపై నుంచి దూసుకొచ్చిన వరద నీరు ధరాలి గ్రామాన్ని తుడిచిపెట్టుకుపోయింది. వరద ఉధృతికి ధరాలి గ్రామంలోని ఇళ్లు, ఎత్తైన భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి. అప్పటి వరకు ప్రజలతో సందడిగా ఉన్న గ్రామం.. జల ప్రళయం ధాటికి శ్మశానంగా మారింది. 

ధరాలి గ్రామంలో వరదలు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. వరద నీటి అలలు బలంగా ఇళ్లను ఒక్కసారిగా ముంచెత్తుతుండటంతో ప్రజలు కేకలు వేస్తుండటం, ప్రాణభయంతో పరుగులు పెడుతున్న హృదయవిదారక దృశ్యాలు కంటతడి తెప్పిస్తున్నాయి. 

ముఖ్యంగా ఇందులో ఒక సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతోంది. వరదల ధాటికి ఊరు ఊరే తుడిచిపెట్టుకోగా.. ప్రజలంతా నీటిలో గల్లంతయ్యారు. వరద ఉధృతిని చూస్తే దాదాపు వారు ప్రాణాలతో బయటపడటం కష్టమే. కానీ ఓ వ్యక్తి మాత్రం చిరంజీవిగా ప్రాణాలతో బయటపడ్డాడు. బురదలో నుంచి బయటకు నడుచుకుంటూ వస్తోండగా.. అక్కడే కొండ మీద ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

వీడియో తీసిన వ్యక్తులు అతడిని బయటకు రావడానికి ప్రోత్సహించారు. బాగ్ బాగ్ (పరిగెత్తూ పరిగెత్తూ) అంటూ ఎంకరేజ్ చేశారు. కానీ అతడు నడవలేక బురదలో కిందపడిపోయాడు. ఇంతలోనే మరో వ్యక్తి  బురద నీటి నుంచి పరిగెత్తూకుంటూ బయటకు రావడానికి ప్రయత్ని్స్తుండగా.. వీడియో తీసిన వ్యక్తులు కిందపడిపోయిన వ్యక్తిని కూడా కాపాడాలని రిక్వెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.