కొత్త పెళ్లి జంటను ఆశీర్వదిస్తూ.. అనంత లోకాలకు

కొత్త పెళ్లి  జంటను ఆశీర్వదిస్తూ.. అనంత లోకాలకు

అదో పెళ్లి వేడుక. ఇంటిల్లిపాది చాలా హ్యాపీగా ఉన్నారు. కుటుంబసభ్యులు అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వ్యక్తి ఆనందంతో డ్యాన్స్ చేయసాగాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ హఠాత్తుగా కూర్చుండిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. అతడికి ఏమైందా అని దగ్గరికెళ్లి చూడగా.. క్షణాల్లోనే  ఆ వ్యక్తి సృహ కోల్పోవడంతో అందరూ షాక్ అయ్యారు.

పెళ్లి వేదికపైనే..

మేనకోడలికి పెళ్లి అయిందనే పట్టరాని సంతోషంలో స్టేజీపైనే డ్యాన్స్‌ చేసిన ఓ వ్యక్తి సడన్‌గా గుండెపోటుతో కుప్పకూలాడు. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా నృత్యం చేసిన అతడు ఉన్నట్టుంది ఛాతీలో ఇబ్బందిగా అన్పించి పెళ్లి వేదికపైనే కూర్చుండిపోయాడు. ఆ తర్వాత క్షణాల్లోనే సృహకోల్పోయి పడిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పెళ్లి సంబరాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయారు.

ఛత్తీస్‌గఢ్‌ రాజనందన్‌గావ్ జిల్లా డోంగర్‌గఢ్‌లో  ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు దిలీప్ రాజ్‌కుమార్. బాలోద్ జిల్లాలో నివసిస్తున్నాడు. భిలాయ్ స్టిల్ ప్లాంట్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లివేదికపై దిలీప్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను అక్కడున్నవారు తమ ఫోన్లో వీడియో తీశారు. ఈ సమయంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలడంతో ఆ దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాసేపట్లోనే వైరల్‌గా మారింది.

ఇటీవలి కాలంలో యువతతో పాటు అన్ని ఏజ్ గ్రూపుల్లో గుండెపోటు కామన్ గా మారడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. మారిన జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. చాలామంది గుండెపోటు బారిన పడేందుకు ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. మూడు పదుల వయస్సులోపు వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. వయసుతో సంబధం లేకుండా, యువకులు, పెద్ద వయస్కులు అనే తేడా లేకుండా చాలా మంది హఠాత్తుగా హార్ట్‌ఎటాక్‌తో కుప్పకూలుతున్నారు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ, గేమ్స్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కల్గిస్తోంది.