ఆన్ లైన్ గేమ్స్ కు మరో యువకుడు బలి.. అప్పుల బాధ తాళలేక చెట్టుకు ఉరేసుకొని..

ఆన్ లైన్ గేమ్స్ కు మరో యువకుడు బలి.. అప్పుల బాధ తాళలేక చెట్టుకు ఉరేసుకొని..

ఆన్ లైన్ గేమ్స్ కి దూరంగా ఉండాలంటూ ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా జనాల్లో మార్పు రావడంలేదు. ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటు పడి అప్పులపాలయ్యి ఆత్మహత్యకు పాల్పడ్డవారి గురించి తరచూ వార్తలు వింటూనే ఉన్నాం.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  షాద్ నగర్  కేశంపేట మండల పరిధి లో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. 

బిహార్ రాష్ట్రానికి చెందిన గుడ్డు కుమార్ యాదవ్ కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్ కు బానిసై కష్టపడి సంపాదించిన డబ్బులు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 6న అదృశ్యమైన యువకుడి మృతదేహం కేశంపేట మండలం చౌలపల్లి రహదారి సమీపంలో చెట్టుపై వేలాడుతుండగా గుర్తించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుమార్ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చేతికి అందివచ్చిన కొడుకు అప్పులపాలయ్యి అర్దాంతరంగా మరణించడంతో కుమార్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఆన్లైన్ గేమ్స్ కి బానిసలయ్యి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని.. ఆన్లైన్ గేమ్స్ కి, బెట్టింగ్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.