జైపూర్‌లో విషాదం: చిన్న పార్కింగ్ గొడవ.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది

జైపూర్‌లో విషాదం: చిన్న పార్కింగ్ గొడవ.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది

పక్కపక్కనే ఇళ్లు.. పొద్దున లేస్తే ఒకరితో ఒకరికి అవసరం.. మంచి చెడులు షేర్ చేసుకుంటారు.. అయితే వారిమధ్య చిన్న గొడవ..ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇంకేముంది అప్పటివరకు సంతోషంగా కుటుంబంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. 

రాజస్థాన్‌లోని జైపూర్‌  పత్రాకర్ కాలనీలో విషాదకరమైన ఘటన వెలుగుచూసింది. కారును బయటికి తీసే క్రమంలో తలెత్తిన ఓ చిన్న వివాదం.. చినికి చినికి గాలివానలా మారి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇరుగుపొరుగు వారి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

ఏం జరిగిందంటే..

పత్రాకర్ కాలనీకి చెందిన విజేంద్ర సింగ్ పక్కింటి వ్యక్తి తన ట్రావెలర్ వాహనాన్ని ఓ ఇరుకైన సందులోంచి బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. సందు చాలా ఇరుకుగా ఉండటంతో, ఆ సమయంలో అక్కడే ఉన్న విజేంద్ర సింగ్ కుటుంబ సభ్యులు వాహనం తీయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరినొకరు నిందించుకునే క్రమంలో అది కాస్తా మాటా మాటా పెరిగి తోపులాటకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో, గొడవను ఆపేందుకు విజేంద్ర సింగ్ మధ్యలోకి వచ్చారు.

కుప్పకూలిన విజేంద్ర సింగ్..

ఈ ఉద్రిక్త పరిస్థితులలో ఇరు వర్గాలను శాంతింపజేసే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన విజేంద్ర సింగ్‌కు ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన ఏమయ్యిందో కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలోపే అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విజేంద్ర సింగ్‌ను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. క్షణాల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. చిన్న పార్కింగ్ వివాదం కళ్లముందే ఇంటి పెద్దను బలితీసుకోవడంతో విజేంద్ర సింగ్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

క్షణికావేశం, చిన్నపాటి సహనం కోల్పోవడం వల్ల విలువైన ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతాయో చెప్పడానికి ఈ విషాద ఘటనే సాక్ష్యం.