భార్యను సెకండ్ హ్యాండ్ అంటావా.. రూ.3 కోట్లు కట్టాలంటూ భర్తకు హైకోర్టు ఆదేశాలు

భార్యను సెకండ్ హ్యాండ్ అంటావా.. రూ.3 కోట్లు కట్టాలంటూ భర్తకు హైకోర్టు ఆదేశాలు

వాళ్లిద్దరూ భార్యభర్తలు.. ధనవంతులు.. బాగా డబ్బున్నోళ్లు.. పెద్దల సమక్షంలోనే ముంబైలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీళ్లు అమెరికా వెళ్లారు.. అక్కడ ఉద్యోగాలు చేశారు.. అక్కడ కూడా బాగా డబ్బులు సంపాదించారు. కొన్నాళ్ల తర్వాత ఇండియా వచ్చారు. ముంబైలో భార్యకు ఉద్యోగం వచ్చింది.. భర్త మాత్రం అమెరికా వెళ్లిపోయాడు. వాస్తవానికి ఈ భార్యభర్తలు ఇద్దరూ అమెరికా పౌరులు. ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లి.. అక్కడే అమెరికా సిటిజన్ షిప్ తీసుకున్నారు. 1994 జనవరి 3వ తేదీ వీరి పెళ్లి ముంబై జరగ్గా.. ఆ తర్వాత అమెరికా వెళ్లి.. అక్కడి చట్టాల ప్రకారం సెక్యూరిటీ కోసం.. అమెరికాలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. 

2005లో ఈ జంట తిరిగి ముంబై వచ్చేసింది.  ముంబైలోనే భార్య ఉద్యోగం సంపాదించింది.. భర్తతో గొడవలతో తల్లి ఇంట్లోనే ఉంటుంది. 2014లో భర్త తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. 2017లో భార్యకు అమెరికా నుంచే విడాకుల నోటీసు పంపాడు. అదే సంవత్సరం అంటే 2017లోనే అమెరికా నుంచి నోటీసులు అందుకున్న భార్య.. ఇండియాలోని ముంబై కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసింది. ఏడాది తర్వాత అంటే 2018లో అమెరికా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. 

ఈ కేసులో ఇక్కడే ట్విస్ట్.. ముంబై కోర్టులో భార్య దాఖలు చేసిన పిటీషన్ ఆసక్తిగా మారింది. సుదీర్ఘ విచారణకు దారి తీసింది. దేశ వ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. పెళ్లి తర్వాత నేపాల్ హనీమూన్ వెళ్లి భార్యభర్తల మధ్య అక్కడ గొడవ జరిగింది. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ పదేపదే కించపరిచే వాడు భర్త.. దీనికి కారణం.. అప్పటికే తన భార్యకు.. తన పెళ్లి కంటే ముందే ఎంగేజ్ మెంట్.. నిశ్చితార్థం అయ్యి క్యాన్సిల్ కావటం. ఆ తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకుంది. దీంతో భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ పదే పదే కించపరిచేవాడు. 

మరో సందర్భంలో అమెరికా వచ్చిన తన తల్లిదండ్రులను అత్యంత నీచంగా చూసేవాడని.. తండ్రికి గుండె ఆపరేషన్ జరిగితే మరో ఇంట్లో ఉంచమని గొడవ చేసేవాడని భార్య తన పిటీషన్ లో స్పష్టం చేసింది. గృహ హింస తీవ్ర స్థాయిలో ఉందని.. అనేక మానసిక వేధింపులు, హింసకు గురైనట్లు భార్య తన పిటీషన్ లో స్పష్టం చేసింది. 

భార్య వాదనలతో ఏకీభవించిన ముంబై కోర్టు.. 2017లో తీర్పు వెళ్లడించింది. భార్యకు ప్రతినెలా లక్షా 50 వేల రూపాయల భరణం, సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచినందుకు 3 కోట్ల రూపాయల పరిహారం, కోర్టు ఖర్చుల కింద 50 వేల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. 

ఈ తీర్పున సవాల్ చేస్తూ.. భర్త సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా భార్యకు అనుకూలం.. భర్తకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పులపై ముంబై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు భర్త. సుదీర్ఘ విచారణ తర్వాత.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచి.. మానసిక వేదనకు గురి చేసిన భర్త.. 3 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందే అని ముంబై హైకోర్టు తీర్పు వెల్లడించింది. భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతిసే అధికారం భర్తకు లేదని స్పష్టం చేసింది. 

భార్యభర్తలు ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్న వారే.. ఉన్నత కుటుంబాలకు చెందిన వారు.. వారి వారి ఉద్యోగాల్లో ఉన్న స్థానాల్లో ఉన్నవారు.. సమాజంలో ఉన్నత స్థాయి గుర్తింపు ఉన్న వారు.. అలాంటి వారు మరొకరి ఆత్మగౌరవాన్ని.. ముఖ్యంగా భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ.. ఓ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనేది సామాజిక రుగ్మతగా భావించాలి.. ఇలాంటి విషయాలను ఉపేక్షించటం అనేది సహించరాని నేరం.. ఉన్నత పదవుల్లో ఉండేవారు.. మరొకరికి మార్గదర్శకంగా ఉండాలి.. మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది ముంబై హైకోర్టు. భార్యకు 3 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందే అని.. కింద రెండు కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ.. తీర్పు వెల్లడించింది.