
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న సంపులో పడి గాయాలపాలైన వ్యక్తిని హైడ్రా కాపాడింది. సంపులో వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు మంగళవారం ఉదయం హైడ్రా డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీం ఇన్‌చార్జి స్వామి బృందం అక్కడికి వచ్చి ఆయనను కాపాడింది.
బాధితుడిని కవాడిగూడకు చెందిన హరీశ్(35)గా గుర్తించారు. గాంధీ ఆసుపత్రిలో సంపు నిర్మాణం జరుగుతోంది. సోమవారం రాత్రి సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లి హరీశ్ అందులో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సైడ్ వాల్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలను కట్ చేసి గాయపడిన వ్యక్తిని కాపాడారు. బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.