- ఉద్యోగం ఇప్పించినందుకు ఫీజుగా రూ.2,500 వసూలు
- పని నచ్చలేదని యువకుడి గొడవ
- రూ.1,500 వెనక్కి ఇచ్చి, మిగతావి ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి ఘాతుకం
- హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఘటన
జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ మధురానగర్పోలీస్స్టేషన్పరిధిలోని యూసఫ్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. రూ.1,000 కోసం ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బంజారాహిల్స్ ఏసీసీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన శశికిరణ్‌రెడ్డి యూసఫ్‌గూడలో వారాహి పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల కింద ప్రభు కుమార్ అనే యువకుడు ఉద్యోగం కోసం ఆయనను సంప్రదించగా.. రూ.2,500 ఫీజు తీసుకొని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేర్పించాడు. అయితే, కొన్ని రోజులుగా ఆ పని నచ్చలేదని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ప్రభుకుమార్శశికిరణ్రెడ్డితో గొడవ పడుతున్నాడు.
పలుమార్లు కన్సల్టెన్సీ ఆఫీస్‌కు వచ్చి, డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. తాను రౌడీషీటర్ నని, చంపేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ప్రభు కుమార్ కన్సల్టెన్సీ ఆఫీస్‌కు వెళ్లి, డబ్బులు ఇవ్వాలని శశికిరణ్ రెడ్డిని పట్టుబట్టాడు. దీంతో ఆయన రూ.1,500 ఇచ్చాడు. మిగతా రూ.1,000 ఇవ్వకపోవడంతో ప్రభు కుమార్ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కత్తితో శశికిరణ్‌రెడ్డి మెడ, ఛాతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన రిసెప్షనిస్ట్ లయపైనా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శశికిరణ్ రెడ్డి, లయను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కాగా, శశికిరణ్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.
