
బైకులు చోరీ చేయడం కామన్ గా చూస్తున్నదే. కానీ.. ఈ దొంగ…. పోలీసులు పెట్రోలింగ్ కోసం ఉపయోగించే బైక్ ను ఎత్తుకుపోయాడు. ఆ తర్వాతేం జరిగింది అన్నది చాలా ఇంట్రస్టింగ్. చదవండి.
అది మంగళవారం. రాత్రి టైమ్. చాదర్ ఘాట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఇద్దరు పోలీసులు తమ పెట్రోలింగ్ బైక్ ను ఆపారు. తాళం చెవి తీసుకోవడం మరిచిపోయారు. కీ దానికే ఉంచి.. స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. క్షణాల్లోనే.. ఓ వ్యక్తి ఆ బైక్ ను వేసుకుని.. అంబర్ పేట్ వైపు దూసుకెళ్లిపోయాడు.
బైక్ ఆపి పోలీసులు లోపలికి వెళ్లడం.. ఆ బైక్ తీసుకుని దొంగ పారిపోవడం చూసిన మరోవ్యక్తి… స్టేషన్ లోపలికి వెళ్లి జరిగింది చెప్పాడు. బైక్ చోరీ అయిందని గుర్తించిన పోలీసులు.. రాచకొండ కమిషనరేట్ టెక్నికల్ స్టాఫ్ ను అలర్ట్ చేశారు. ఆ బైక్ ను ట్రాక్ చేయాలని సూచించారు.
సాధారణంగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాల్లో జీపీఆర్ఎస్, జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. దాని ఆధారంగా.. ఆ బైక్ ఏ రూట్ లో వెళ్తుందో గమనిస్తూ.. వాకీ టాకీతో కమ్యూనికేట్ చేశారు. ఉప్పల్ వైపు వెళ్లిన తర్వాత.. అక్కడినుంచి ఎల్బీ నగర్ వైపు టర్న్ తీసుకోవడం గుర్తించారు. వెంటనే ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కె.నర్సింహులుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్టైన ఎస్సై.. మరో ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఎం.అరుణ్, రవిందర్ తో కలిసి అటుగా వస్తున్న పోలీస్ పెట్రోల్ బైక్ ను ఆపారు. తమ వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. దొంగను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఆపరేషన్ 40 నిమిషాల్లో పూర్తిచేశామని పోలీసులు చెప్పారు.
బైక్ దొంగను చాదర్ ఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని సూర్యాపేటకు చెందిన కనక మధుగా గుర్తించారు. బైక్ ను దొంగతనం చేసింది నిజమే అని ఒప్పుకున్న అతడు.. అందుకు కారణాలు చెప్పలేదు. ఖమ్మంవైపు వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు. ఐపీసీ సెక్షన్ 379 కింద.. అతడిపై దొంగతనం కేసు పెట్టారు పోలీసులు. ఈ ఆపరేషన్ లో పాల్గొని… బైక్ చోరీ అడ్డుకున్న పోలీసులకు క్యాష్ రివార్డ్ అందజేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్.