ఆరు సెకన్లలో.. రూ. 40 లక్షలు కొట్టేశారు

ఆరు సెకన్లలో.. రూ. 40 లక్షలు కొట్టేశారు

దొంగతనం చేస్తే ఎలా ఉండాలి.. ఫ్యాంట్ కు తెలియకుండా కట్ డ్రాయర్ కొట్టేయాలి.. కుడి చేతికి తెలియకుండా ఎడమ చెయ్యి పని చేయాలి.. అక్షరాల ఇలాంటి దొంగతనమే.. బహిరంగ ప్రదేశంలో.. వందలాది మంది చుట్టూ ఉన్నా.. కళ్లు మూసి తెరిచే లోపు.. ఆరు సెకన్లలో.. ఏకంగా 40 లక్షల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు.. 

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన.. సీసీ కెమెరాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అదే అక్కడ సీసీ కెమెరాలు లేకుంటే ఎప్పటికీ దొరికేవాళ్లు కాదు దొంగలు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి భుజానికి బ్యాగ్ తగిలించుకుని.. బైక్ పై వెళుతున్నాడు. ఎర్రకోట దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాడు. ఓ ముగ్గురు వ్యక్లుల ముఠా.. బైక్ దగ్గరకు వచ్చి బ్యాగ్ లోని 40 లక్షల రూపాయలతో క్షణాల్లో మాయం అయ్యింది. కేవలం ఆరు సెకన్లలోనే బ్యాగ్ లోని 40 లక్షలు కొట్టేశారు. ఒకడు బ్యాగ్ జిప్ తీయటం.. మరొకడు బ్యాగ్ లోని డబ్బు కట్టలు తీయటం.. మరొకడు ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లు డ్రామా చేయటం జరిగింది. బాధితుడు బైక్ ముందూ వెనకా పక్కన కార్లు, మరికొన్ని బైక్స్ ఉన్నాయి.. ఎవరూ కూడా దీన్ని గమనించకపోవటం విశేషం. 

ఇంటికి వెళ్లిన బాధితుడు బ్యాగ్ లోని డబ్బు లేకపోవటంతో పోలీసులకు కంప్లయింట్ చేశాడు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. ఆ ముగ్గురిని గుర్తించారు. వీరిలో అభిషేక్, ఆకాష్ అనే ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు పోలీసులు. 40 లక్షల్లో 38 లక్షలు రికవరీ చేశామని.. మరో రెండు లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కొన్నాళ్లుగా ముగ్గురు సభ్యుల ముఠా.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలాంటి దొంగతనాలు చేస్తున్నారని స్పష్టం చేశారు పోలీసులు. ఈ ఘటన మార్చి ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది.