ఏథెన్స్: సరదాగా బీచ్‌లో గడిపేందుకు వెళ్లిన ఓ యువకుడిని అలలు సముద్రంలోకి లాక్కెళ్లినయి.. మరోచోట ఓ కుటుంబం సముద్రపు ఒడ్డున సేదతీరుతోంది. వాళ్ల పిల్లలు నీళ్లల్లో ఆడుకుంటూ ఫుట్‌బాల్ పోగొట్టుకున్నరు. ఈ రెండు ప్రాంతాలకూ మధ్య సుమారు 130 కిలోమీటర్లు. అయితే, ఆ పిల్లలు పోగొట్టుకున్న బాలే ఈ యువకుడి ప్రాణాలు నిలిపింది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది వచ్చేవరకూ ఆ బాల్‌ను పట్టుకుని నీళ్లలో తేలుతూ గడిపానని నార్త్ మెసడోనియాకు చెందిన ఇవాన్ చెప్పాడు. గ్రీస్‌లోని కాసండ్రా సిటీలో బీచ్‌లు బాగా ఫేమస్. ఇక్కడి మైటీ బీచ్‌లో సరదాగా గడిపేందుకు ఇవాన్ తన ఫ్రెండ్స్ కలిసి వచ్చాడు. సముద్ర తీరంలో స్విమ్మింగ్ చేస్తుండగా ఇవాన్‌ను అలలు లోపలికి లాగేసినయి.. తనతో పాటు ఇంకో స్నేహితుడు కూడా సముద్రంలో గల్లంతయ్యాడు.
చాలా దూరం కొట్టుకుపోయిన ఇవాన్ నీటిలో తేలేందుకు చాలా కష్టపడ్డడు. కొంతసేపటికి ఓ ఫుట్‌బాల్ తనవైపు కొట్టుకురావడంతో దానిని ఆసరాగా పట్టుకున్నడు. అట్లా 18 గంటలు అలాగే తేలుతూ ఉండిపోయిండు. ఈలోపు మిగతా దోస్తులు అలర్ట్ చేయడంతో సముద్రంలో వెతుకుతున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది ఇవాన్‌ను కాపాడారు. ఇదంతా ఇవాన్ మీడియాకు చెప్పాడు. మీడియాలో చూసి ఇవాన్‌ను కాపాడిన బాల్‌ను ఓ మహిళ గుర్తుపట్టింది. పది రోజుల కిందట లెమనోస్ దీవికి కుటుంబంతో సహా పిక్నిక్ వెళ్లామని, అక్కడ సముద్రంలో పిల్లలు ఆడుకుంటూఈ బాల్‌ను పోగొట్టుకున్నారని చెప్పింది.
