- ‘మీ డబ్బు–మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
నస్పూర్, వెలుగు: ‘మీ డబ్బు–మీ హక్కు’ కార్యక్రమం ద్వారా బ్యాంకులు, బీమా సంస్థలు, పోస్టాఫీసుల్లోని ఖాతాల్లో క్లెయిమ్ చేయని సొమ్మును తిరిగి పొందేందుకు అవకాశం కల్పించారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తులను సమర్థంగా త్వరగా పరిష్కరించేందుకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం చేతన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం అపర్ణ రెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ప్రశాంత్, ఎడీసీసీ ఏజీఎం రవి కిశోర్‌తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 10 సంవత్సరాలు దాటి ఖాతాల్లో నిల్వ ఉండి వినియోగించని నగదుకు సంబంధించి ఎవరైనా సంబంధిత బ్యాంకులో కేవైపీ డాక్యుమెంట్, ఇతర ధ్రువపత్రాలు సమర్పించి తిరిగి పొందవచ్చని తెలిపారు. అన్ క్లెయిమ్ నగదు వివరాలను బ్యాంకుకు వెళ్లి, లేదా ఉద్గమ్(UDGAM) పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ విషయమై గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లాలోని కొన్ని అన్ క్లెయిమ్ ఖాతాల నుంచి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ కిరణ్ కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, షెడ్యూల్డ్ కులా అభివృద్ధి శాఖ డిప్యూడీ డైరెక్టర్ చాతరాజుల, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి రాజేశ్వరి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, జిల్లాలోని వివిధ బ్యాంకులకు అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న సొమ్ము చెల్లించేందుకు చర్యలు
ఆదిలాబాద్, వెలుగు: బ్యాంకుల్లో పదేండ్లుగా లావాదేవీలు జరగని ఖాతాల్లోని సొమ్మును ఖాతాదారులు లేదా వారి వారసులకు అందించే దిశగా ఆర్బీఐ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ‘మీ డబ్బు-మీ హక్కు’పైబుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆర్బీఐ సూచనల మేరకు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌పై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.29 కోట్ల విలువైన డిపాజిట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా కొందరు ఖాతాదారులు, వారసులు క్లెయిమ్ చేయగా బ్యాంకుల వారీగా నగదును అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పాల్ కుమార్ దాస్, ఆర్బీఐ అధికారి దామోదర్, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో రవీందర్ రాథోడ్, డీఎంహెచ్ నరేందర్ రాథోడ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
