లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు..ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ 

లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు..ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ 
  • జిల్లాలో 42 శాతం లోటు వర్షపాతం 
  • వరి పంట వేయొద్దని రైతులకు సూచన 
  • గ్రామాల వారిగా సాగుపై అవగాహన 

హాజీపూర్​మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు మూడెకరాల్లో పత్తి పంట వేశాడు. వానల్లేక వాడిపోతున్న మొక్కలను కాపాడుకుందుకు వారం క్రితం ఇలా బిందెలతో నీళ్లు పోశాడు. పెద్దంపేట, గొల్లపల్లి, కొండాపూర్​తదితర గ్రామాల్లో సైతం పలువురు రైతులు కూలీలను పెట్టి పత్తి మొక్కలకు నీళ్లు పోయించారు.

మంచిర్యాల, వెలుగు: ఎల్​నినో ఎఫెక్ట్​తో మంచిర్యాల జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. వర్షాలు లేక ఓవైపు పత్తి రైతులు ఆందోళన చెందుతుండగా, వరి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పంటలే అన్నదాతలను ఆదుకోనున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ మేరకు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపించారు. రైతులు తొందరపడి బోర్లు, బావుల కింద వరి పంట వేయవద్దని.. రానున్న రోజుల్లో సాధారణ వర్షాలు కురవకపోతే చెరువులు, కుంటలు ఎండిపోయి బోర్లు, బావులు రీచార్జ్​ కావడం కష్టమని హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 

లక్షన్నర ఎకరాల్లో పత్తి 

జిల్లాలో ఈ వానాకాలం సీజన్​లో 1.70 ఎకరాల్లో పత్తి, 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటివరకు 1.50 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా, 1,427 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడ్డాయి. బోర్లు, బావుల కింద మరో 30 వేల ఎకరాలకు నార్లు పోసి వానల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు జిల్లా సాధారణ వర్షపాతం 336.6 మిల్లీమీటర్లకు గాను 195 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 42 శాతం లోటు వర్షపాతం నెలకొన్నది. పత్తి మొక్కలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో పలుచోట్ల రైతులు మోటార్లు, బిందెలతో నీళ్లు పోస్తూ వాటిని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జోరు వానలు కురవాల్సిన సమయంలో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జిల్లాలో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికీ వర్షాలు పడకపోతే పత్తి చేలు ఎండిపోయే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఎకరానికి రూ.20 వేలకు పైగా పెట్టుబడి పెట్టి లబోదిబోమంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. 

ప్రత్యామ్నాయ పంటలే మేలు 

వర్షాభావం నేపథ్యంలో పత్తి, వరి మినహా తక్కువ నీటితో సాగయ్యే ఇతర పంటలు వేసుకోవడమే మేలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన కంది, పెసర, అలసంద, జొన్నలు, రాగులు, ఉలవలు, మక్కలు, నువ్వులు, పల్లి తదితర పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ మేరకు జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు రూపొందించారు. అవసరమైన విత్తనాల కోసం ఇటీవలే ప్రభుత్వానికి ప్రపోజల్స్​పంపినట్టు డీఏవో సురేఖ తెలిపారు. ఈ నెలాఖరు వరకు వర్షాల తీరును బట్టి విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.