కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టిన వీరాభిమాని

కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టిన వీరాభిమాని
  •     కుటుంబ పోషణకు మంచిర్యాల జిల్లా దండేపల్లి వాసి కష్టాలు
  •     బాధలు చెప్పుకునేందుకు కేసీఆర్​, కేటీఆర్​ అపాయింట్​మెంట్​ఇవ్వలేదని ఆవేదన


​మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్​కు ఇంట్లో గుడి కట్టి పూజలు చేసిన ఓ వీరాభిమాని.. కేసీఆర్​ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టారు. పార్టీ కోసం ఎంతో కష్టపడితే తన బాధలు చెప్పుకునేందుకు కూడా కేసీఆర్, కేటీఆర్​అవకాశం ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకు విగ్రహాన్ని అమ్మేందుకు సిద్ధమయ్యారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా రవీందర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్​కు జైకొట్టారు. 35కు పైగా బైండోవర్ కేసులు పెడితే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. 2012లో దండేపల్లిలో సొంత ఖర్చులతో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్​ జయశంకర్​ విగ్రహాలు పెట్టారు. టీఆర్​ఎస్ అధికారంలోకి వచ్చాక 2016లో కేసీఆర్​కు తన ఇంట్లో గుడి కట్టి ఫ్యామిలీ మెంబర్స్​తో కలిసి రోజూ పూజలు చేశారు. తనకున్న రెండెకరాల భూమి అమ్మి దండేపల్లి మండలం మ్యాదరిపేటలో కేబుల్​ఆపరేటర్​గా బిజినెస్​ స్టార్ట్​ చేశారు. ఆ బిజినెస్​ను 2018లో అక్రమంగా మరొకరు లాక్కోవడంతో రోడ్డున పడ్డారు. దీంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు దీక్ష చేసినా, సెల్​టవర్ ఎక్కినా ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్​, కేటీఆర్​లను కలిసి తన బాధలు చెప్పుకునేందుకు ప్రయత్నించినా అపాయింట్​మెంట్​ దొరకలేదు. దీంతో ప్రగతిభవన్​ దగ్గర పెట్రోల్​ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశారు. అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లు కాపాడారు. పార్టీ కోసం కష్టపడితే తనకు గుర్తింపు దక్కలేదంటూ ఈ ఏడాది జనవరిలో కేసీఆర్​ విగ్రహానికి ముసుగు కప్పి నిరసన తెలిపారు. పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అప్పులు తీర్చేందుకు, కుటుంబ పోషణ కోసం ఆ విగ్రహాన్ని ఆదివారం ఫేస్​బుక్​లో అమ్మకానికి పెట్టానని చెప్పారు.