మూడు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. రంగారెడ్డి.. మంచిర్యాల జిల్లాల్లో ఘటనలు

మూడు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. రంగారెడ్డి.. మంచిర్యాల జిల్లాల్లో ఘటనలు
  •  మంచిర్యాల జిల్లాలో ఎక్స్‌‌ఎల్‌‌ను ఢీకొట్టిన లారీ, దంపతులు..
  • రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు, భూపాలపల్లిలో  మరో ఇద్దరు మృతి

జైపూర్, వెలుగు : టీవీఎస్‌‌ ఎక్స్‌‌ఎల్‌‌ను లారీ ఢీకొట్టడంతో దంపతులు చనిపోయారు. ఈ ప్రమాదం మంచిర్యాల జిల్లా జైపూర్‌‌ మండలంలోని ఇందారం కాసింపల్లి ఫ్లైఓవర్‌‌పై బుధవారం జరిగింది. ఎస్సై రాజశేఖర్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... నస్పూర్‌‌ మండలంలోని సంగమల్లయ్యపల్లెకు చెందిన బేతోజు భారతమ్మ (55), నారాయణ (73) దంపతులు వేలాల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు బుధవారం టీవీఎస్‌‌ ఎక్స్‌‌ఎల్‌‌పై వెళ్తున్నారు. కాసింపల్లి ఫ్రైఓవర్‌‌ బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి లారీ ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల కుమారుడు శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్‌‌ తెలిపారు. 

షాద్‌‌నగర్‌‌ సమీపంలో ఇద్దరు...

షాద్‌‌నగర్‌‌, వెలుగు : కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌‌ సమీపంలోని రాయికల్‌‌ టోల్‌‌ ప్లాజా వద్ద బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తుర్కయాంజల్‌‌కు చెందిన పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్‌‌రెడ్డితో పాటు మరో ముగ్గురు కలిసి అరుణాచలం వెళ్లారు.

దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా.. రాయికల్‌‌ టోల్‌‌ ప్లాజా సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో పురుషోత్తంరెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్‌‌రెడ్డి అక్కడికక్కడే చనిపోగా, మిగతా ముగ్గురికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని షాద్‌‌నగర్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు.

భూపాలపల్లిలో జిల్లాలో రెండు బైక్‌‌లు ఢీ, ఇద్దరు మృతి

భూపాలపల్లి రూరల్, వెలుగు : రెండు బైక్‌‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదం భూపాలపల్లి మండలం కమలాపూర్‌‌ క్రాస్‌‌ వద్ద బుధవారం రాత్రి జరిగింది. చనిపోయిన వారిని గణపురం మండల కేంద్రానికి చెందిన రెబ్బ శ్రీకాంత్ (26), భూపాలపల్లి మండలం నర్సింగాపూర్‌‌ గ్రామానికి చెందిన గాదె మహేశ్‌‌ (25)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.