తల్లుల ఒడికి చేరిన పిల్లలు

తల్లుల ఒడికి చేరిన పిల్లలు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల గవర్నమెంట్ జనరల్​ హాస్పిటల్​(జీజీహెచ్​)లో పసికందుల తారుమారు ఘటన చిక్కుముడి వీడింది. మంగళవారం డీఎన్ఏ రిపోర్టు రావడంతో వారం రోజుల సస్పెన్స్​కు తెరపడింది. డాక్టర్లు చెప్పినట్టే మమతకు పాప, పావనికి బాబు పుట్టినట్టు డీఎన్ఏ రిపోర్టులో తేలింది. హైదరాబాద్​లోని ఫోరెన్సిక్​ ల్యాబ్​ నుంచి వచ్చిన సీల్డ్​ కవర్​ను డీసీపీ అఖిల్​మహాజన్​ సమక్షంలో ఆయన ఛాంబర్​లో ఓపెన్​ చేశారు. తండ్రులకు కౌన్సెలింగ్​ నిర్వహించిన తర్వాత హాస్పిటల్​ సూపరింటెండెంట్ ​డాక్టర్​ హరిశ్చంద్రారెడ్డి శిశువులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎట్టకేలకు పిల్లలు తల్లుల ఒడికి చేరడంతో కథ సుఖాంతమైంది.  

అసలేం జరిగిందంటే...

కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లా కేంద్రానికి చెందిన బొల్లం పావని, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన దుర్గం మమతకు డిసెంబర్​ 27న రాత్రి సిజేరియన్​ చేశారు. పావనికి బాబు, మమతకు పాప పుట్టగా విషయాన్ని డాక్టర్లు వారికి చెప్పారు. సిబ్బంది ట్యాగ్​లు తప్పుగా వేసి ఒకరి శిశువును మరొకరికి అప్పగించారు. పొరపాటును గుర్తించి ఎవరి శిశువును వారు తీసుకోవాలని కోరారు. అప్పటికే బాబును పిల్లల డాక్టర్​కు చూపించి వ్యాక్సిన్​ వేయించిన మమత కుటుంబీకులు వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. డాక్టర్లు, సిబ్బంది తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రెండు కుటుంబాలు ఆందోళన చేశాయి. మమత తనకు పాపే పుట్టిందని చెప్పినా భర్త నమ్మలేదు. మగబిడ్డ మావాడంటే మావాడంటూ గొడవ పడ్డారు. అధికారులు శిశువులను ఐసీడీఎస్​ అధికారులకు అప్పగించి ఎన్ఐసీయూలో ఉంచారు. డిసెంబర్​30న పిల్లలు, తల్లిదండ్రుల డీఎన్ఏ శాంపిల్స్​ సేకరించి హైదరాబాద్​లోని ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపి నాలుగు రోజుల్లోనే రిపోర్ట్​వచ్చేలా కృషి చేశారు. ఘటనపై ఎంక్వయిరీ జరిపించి బాధ్యులైన స్టాఫ్​నర్స్​, ఆయాలను విధుల నుంచి తొలగించారు.