కేసీఆర్ వల్లే దళితులకు అన్యాయం

కేసీఆర్ వల్లే దళితులకు అన్యాయం

తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక ఓట్లు దండుకునే రాజకీయం ఉందని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దళితులకు కేసీఆర్ వల్లే అన్యాయం జరుగుతోందన్నారు.గతంలో దళితున్ని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని.. కొత్త రాజ్యాంగం రాయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంలో తెలంగాణ దళిత ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా వహించారో సమాధానం చెప్పాలన్నారు.

చదువుకు దళితులు, బీసీలను దూరం చేయడానికే ప్రైవేట్ వర్సిటీలను రాష్ట్రానికి కేసీఆర్ తెచ్చారని  మందకృష్ణ పేర్కొన్నారు. ప్రకృతి వనాలు, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల పేరిట ఉమ్మడి రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన భూములనూ కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు లాక్కుందన్నారు. తెలంగాణ ఏర్పడితే దళిత, గిరిజనులకు 3 ఎకరాలు చొప్పున భూమిని ఇస్తానని చెప్పిన కేసీఆర్..  ఎక్కడ ఇచ్చారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ‘‘పేదలకు అన్నం పెట్టేది రాజ్యాంగం ..సంస్థలకు పేర్లు పెడితే కడుపు నిండదు’’ అని ఆయన కామెంట్ చేశారు.