దళిత బంధుతో కేసీఆర్ డ్రామాలు

దళిత బంధుతో కేసీఆర్ డ్రామాలు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు హుజురాబాద్ భయం పట్టుకుందన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. సోమవారం ఆయన పార్సిగుట్టలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఏడేళ్లలో దళితులకు చేసిన మోసాలతోనే కేసీఆర్ కు ఓటమి భయం పెంచుతుందన్నారు. భ్రమలు పెట్టడం కేసీఆర్ కు వెన్నతోపెట్టిన విద్యని.. 12 ఏళ్ళు దళితుడే ముఖ్యమంత్రి అని భ్రమల్లో పెట్టిన కేసీఆర్, అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరని ఒక చిన్న సాకుతో  తప్పుకున్నాడన్నారు. మూడెకరాల భూ పంపిణి ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఆపేసిండని..దళిత బంధును కూడా అట్లనే ఆపేయగలడన్నారు. హుజురాబాద్ లో ఎలాగైనా గెలవాలనే కేసీఆర్ దళితబంధు ప్రకటన చేశారన్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం 21వేల కుటుంబాలున్నాయని..80 వేల మంది ప్రజలున్నారని తెలిపారు.  దళిత ఓట్లు కీలకం కాబోతున్నాయని వారిని అక్కున చేర్చుకుంటున్నట్లుగా కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు హుజురాబాద్ జ్వరం రోజురోజుకు పెరుగుతుందన్నారు.  ప్రతి దళిత కుటుంబానికి 10లక్షలు అంటూ పథకాన్ని తీసుకొచ్చింది దళితుల మనోభావాలు ఎలా ఉన్నాయనేదానిపైనే సర్వేలు చేయిస్తున్నారన్నారు. 70 శాతం దళిత యువత వ్యతిరేకంగా ఉన్నారని.. ఏడేళ్లుగా కేసీఆర్ చేస్తున్న మోసాలపై గుర్రుగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారనే అంశం వారు నిర్వహించుకున్న సర్వేల్లో వస్తుందని చెప్పారు. ఈ ఎన్నిక ఫలితమే 2023 రిపీట్ అవుతుందనే భయం కేసీఆర్ కుందన్నారు. అందుకే రైతుబంధు నాటకంలాగే.. దళితబంధును ఎత్తుకున్నారన్నారు. రాజకీయ లబ్ది, ఓట్లకోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుందని.. హుజురాబాద్ లో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టే దళిత బంధుకు నిధులు ఎక్కడివో చెప్పాలన్నారు. హుజురాబాద్ లో మొదలుపెట్టి హుజురాబాద్ లో ముగించే పథకమో స్పష్టం చేయాలన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఎక్కడి నుంచి తీస్తున్నారో చెప్పాలని..సబ్ ప్లాన్ లో ఇచ్చిన నిధులు వాడుతున్నారా?  అని ప్రశ్నించారు. 


అదనపు నిధులైతే బడ్జెట్ ఎక్కడిదని.. 119 నియోజక వర్గాలకు 1200 కోట్లని ఒక్క హుజురాబాద్ కోసమే 2వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారన్నారు. భూములు అమ్మగా వచ్చిన డబ్బును కేటాయిస్తున్నారా.. లేక సీఎం వేరే బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారా అనే అంశాన్ని స్పష్టం చేయాలన్నారు. దళితుల కోసం 90 వేల కోట్ల నిధులు కేటాయించి, 55 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తున్న ప్రభుత్వం.. మిగిలిన 35వేల కోట్లు ఎక్కడున్నాయో ప్రభుత్వం బహిరంగ పరచాలన్నారు.రూ. 35 వేల కోట్లను దారి మళ్లించారనేదానికి సాక్షలున్నాయన్నారు. మొత్తం రూ.65 వేల కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని..దళితుల నిధులు దళితులకు ఇస్తున్నారా లేక అదనంగా ఇస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. మరియమ్మ కుటుంబానికి ఇచ్చిన  డబ్బులు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇవ్వకుండా ఎస్సి డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారన్నారు. మూడెకరాల భూమి పంపిణీకి అమ్మేటోడే లేడని తప్పించుకున్నాడని.. ప్రాజెక్టుల కోసం, ఫామ్ హౌస్ ల కోసం సేకరించగలేనిది దళితులకు ఇచ్చేందుకే భూమి దొరకలేదా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి రాజన్నను బర్తరఫ్ చేసి కనీసం కారణం కూడా చెప్పేలేదని..కేసీఆర్ మంత్రివర్గంలోని అత్యంత సమర్ధుడైన కడియం శ్రీహరికి మళ్లోసారి మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ భ్రమలు పెట్టగలడు, మోసం చేయగలడు  హుజురాబాద్ ఎన్నికల్లో గంపగుత్తగా దళిత ఓట్లు పొందేందుకే దళితబంధు అన్నారు. 10 లక్షలు ఏ అవసరానికైనా వాడుకోవచ్చంటూ డ్రామాలకు తెరలేపాడన్నారు. దళితబంధు స్థానంలో మూడేకరాల భూమి అయినా ఇవ్వాలని.. భూములు దొరకకపోతే రూ. 30లక్షలు ఆ కుటుంబాలకు ఇవ్వాలన్నారు. కీసీఆర్ వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. కేసీఆర్ పంచె డబ్బు అయన ఇంట్లనుంచి ఇవ్వట్లేదన్నారు. దళిత ప్రజలందరూ గమనించాలని..118 నియోజకవర్గాల్లో దళితులు అభ్యున్నతి జరగాలంటే కేసీఆర్ ను ఓడించడమే దళితుల ముందున్న లక్ష్యం అన్నారు. రాజకీయ, మంత్రివర్గం, అన్నిరంగాల్లో దళితుల వాటా తేల్చాలన్నారు. కొప్పుల ఈశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతోపాటు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని.. కరీంనగర్ నుంచే మొదలు పెడుతా అంటున్నావు కదా రసమయికి మంత్రి ఇవ్వు, ఇంకొకటి కడియం శ్రీహరికైనా మరే ఇతర దళిత బిడ్డకు ఇవ్వాలన్నారు. ఏడేళ్లుగా దళితులను ఎన్నో రకాలుగా మోసం, అవమానాలకు గురిచేస్తూ.. ఇప్పుడు ఎన్నికలు రాగానే తాయిలాలు ఇస్తే ఎవరు మోసపోరన్నారు. నియోజకవర్గాల్లో అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తే రూ. 2.40లక్ష కోట్లు అవుతుందని.. ఎక్కడి నుంచి ఈ నిధులు తెస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.