సంపూర్ణ మెజార్టీ ఉండగా వర్గీకరణలో ఇబ్బందేంటి? : మంద కృష్ణ మాదిగ

సంపూర్ణ మెజార్టీ ఉండగా వర్గీకరణలో ఇబ్బందేంటి? : మంద కృష్ణ మాదిగ
  • బీజేపీకి మంద కృష్ణ మాదిగ ప్రశ్న

పద్మారావునగర్, వెలుగు : కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ కలిగి ఉన్నప్పటికీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆలస్యం చేయడం సరికాదని, వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోతే దోషిగా నిలబడాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మోదీ ప్రభుత్వంలో వారికి అవసరమైన బిల్లులను పెట్టి, చట్టాలుగా చేసుకుంటున్నప్పటికీ, ఎందుకో వర్గీకరణ బిల్లు మాత్రం ముందుకు తీసుకురావడం లేదన్నారు. బిల్లు పెడితే వచ్చే ఎన్నికల్లో సహకరిస్తామన్నారు. 

బుధవారం పార్శీగుట్టలోని ఎమ్మార్పీఎస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేవెళ్ల సభలో విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను స్వాగతిస్తున్నామన్నారు. డిక్లరేషన్ లోని 12 అంశాలను అమలు చేస్తే దళితులు, గిరిజనులకు ఉమ్మడి ప్రయోజనాలు కలుగుతాయని, కానీ అమలు చేయడంలో కాంగ్రెస్​ చిత్తశుద్ధిపైనే అనుమానాలు ఉన్నాయన్నారు.  వచ్చే నెలలో అపాయిమెంట్ కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశామని, మాదిగలకు న్యాయబద్ధంగా రావాల్సిన టిక్కెట్ లను వారికి కేటాయించాలని, 

మధిర, తుంగతుర్తి, చెన్నూరు, స్టేషన్​ ఘనపూర్​ నియోజకవర్గాల్లో మెజారిటీ ఉన్న మాదిగలను కాదని, మాలలకు టిక్కెట్లు ఇవ్వడం ఏమిటని కేసీఆర్ ను  ప్రశ్నించారు. ఎవరికి టిక్కెట్లు ఇవ్వడమనేది కేసీఆర్ ఇష్టమైనప్పటికీ, ఏ కులానికి వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ నిరాకరించారో, అదే కులంలో మరొకరికి టికెట్ ఇవ్వాలనేది తమ డిమాండ్ అన్నారు.