
న్యూఢిల్లీ: ఇండియా ప్రొఫెషనల్ బాక్సర్ మన్‌దీప్ జంగ్రా వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూబీఎఫ్) సూపర్ ఫెదర్‌వెయిట్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ఫైట్‌లో బ్రిటన్‌కు చెందిన కొనార్ మెకింతోష్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. పది రౌండ్ల ఫైట్‌లో ఇండియా బాక్సర్ పవర్ ఫుల్ పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. చాలా రౌండ్లలో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. ఈ టైటిల్ తన కెరీర్‌లో అతి పెద్ద విజయాల్లో ఒకటని జంగ్రా చెప్పాడు. 2021లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అరంగేట్రం చేసిన హర్యానా బాక్సర్ ఈ టైటిల్ మరికొందరు ఇండియా బాక్సర్లు ప్రొఫెషనల్‌గా మారడానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని తెలిపాడు. మాజీ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ రాయ్ జోన్స్ జూనియర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న 31 ఏండ్ల జంగ్రా తన ప్రొషెషనల్ కెరీర్‌లో ఇప్పటి వరకూ 12 బౌట్లలో పోటీపడి 11 గెలిచి, ఒక్కదాంట్లో మాత్రమే ఓటమి ఎదుర్కొన్నాడు.